తిరుమల వైకుంఠ ద్వార దర్శనంపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో జనవరి 13వ తేదీకి సంబంధించినరి వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీని టిటిడి అధికారులు జనవరి 11 శనివారం రాత్రి నుంచే ప్రారంభించారు. ముక్కోటి ఏకాదశితో పాటు తొలి మూడు రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి జనవరి 8 రాత్రి టోకెన్లు ఇచ్చిన విషయం తెలిసిందే.జనవరి13వ తేదీ (సోమవారం) నుంచి ఏ రోజుకారోజు టోకెన్లు జారీ చేస్తామని టిటిడి అధికారులు గతంలో ప్రకటించారు. అయితే శనివారం రాత్రికే తిరుపతిలోని టోకెన్ జారీ కేంద్రాల వద్దకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో తోపులాట వంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు జారీ ప్రక్రియను అధికారులు ముందుగానే ప్రారంభించారు.
ALSO READ | తిరుమల శ్రీవారిలో హుండీలో బంగారం చోరీ.. టీటీడీ ఉద్యోగి చేతివాటం
తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్‌లలోని మూడు కేంద్రాల దగ్గర జనవరి 13 నుంచి ఏ రోజుకారోజు టోకెన్లు జారీ చేస్తామని టిటిడి అధికారులు ముందుగా చెప్పారు. అయితే వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల కోసం శనివారం రాత్రికే భక్తులు తిరుపతి చేరుకున్నారు. వీరంతా మూడు కేంద్రాల్లోని క్యూలైన్లలోకి భారీగా చేరుకున్నారు. అధికారులు చెప్పినా తాము వేచి ఉంటామని చెబుతూ అక్కడే కూర్చున్నారు.
దీంతో మళ్లీ ఎక్కువ మంది భక్తులు కేంద్రాల వద్ద గుమిగూడితే పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉందని అధికారులు భావించారు. దీంతో 13వ తేదీ తెల్లవారుజామున 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు గల వివిధ స్లాట్ల వైకుంఠ ద్వార దర్శన టోకెన్లను జనవరి 11 రాత్రి 9 గంటల నుంచి ప్రారంభించారు. సుమారు 46 వేల టోకెన్లు ఇవ్వనున్నారు. వచ్చిన భక్తులకు వచ్చినట్లు టోకెన్లు జారీ చేయడం వల్ల కేంద్రాల వద్దరద్దీ లేకుండా చేయవచ్చని టిటిడి అధికారులు భావిస్తున్నారు. కేంద్రాల వద్ద భక్తులు తగ్గాక క్యూలైన్లలో కాకుండా నేరుగా కౌంటర్ల వద్దకు పంపించి వారికి టోకెన్లు ఇస్తున్నారు.