
- ఏపీ సీఎం చంద్రబాబు చొరవ తీసుకోవాలి: మంత్రి సురేఖ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సిఫార్సు లేఖలను టీటీడీ పట్టించుకోవడం లేదని మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఏపీ సీఎం చంద్రబాబుకు లెటర్ రాశారు.
ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు ప్రాధాన్యం ఇచ్చేలా చూడాలని కోరారు. తిరుమల, తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం సిఫార్సు లేఖల వ్యవస్థను తిరిగి తీసుకొచ్చినందుకు ఏపీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయంపై తెలంగాణ ప్రజాప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారని, వారి తరఫున ఆమె ధన్యవాదాలు తెలిపారు.
కానీ, తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇచ్చిన సిఫార్సు లేఖలను టీటీడీ పట్టించుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో తెలంగాణ భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, వారి మనోభావాలు దెబ్బతింటున్నాయన్నారు. టీటీడీ అధికారులు సీఎం ఆదేశాలను ఆచరణలో పెట్టడం లేదన్నారు.
భక్తులు ఇక్కడి నుంచి లేఖలు తీసుకెళ్తున్నారని, అక్కడి అనుమతించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో ఏపీ సీఎం ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు.