టీటీడీ ఉద్యోగిపై బోర్డు సభ్యుడు నరేశ్ బూతు పురాణం : రాజీనామాకు ఉద్యోగ సంఘాల డిమాండ్ పై సీఎం చంద్రబాబు ఆరా

టీటీడీ ఉద్యోగిపై బోర్డు సభ్యుడు నరేశ్ బూతు పురాణం : రాజీనామాకు ఉద్యోగ సంఘాల డిమాండ్ పై సీఎం చంద్రబాబు ఆరా

టీటీడీ ఉద్యోగిపై బోర్డు మెంబర్ నరేష్ కుమార్ బూతు పురాణం వివాదాస్పదంగా మారింది. ఉద్యోగిపై బూతులు తిట్టడంతపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బోర్డ్ మెంబర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. లేని పక్షంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

మంగళవారం (ఫిబ్రవరి 18) దర్శనం అనంతరం తను వస్తుంటే గేటు తీయలేదని బోర్డు మెంబర్ నరేష్ కుమార్ టీటీడీ ఉద్యోగిపై తీవ్ర స్థాయిలో రెచ్చిపోయిన విషయం తెలిసిందే. ‘నన్నే ఆపుతావా.. నీ అంతు చూస్తా.. ఇక్కడ ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తా’ అని బెదిరిస్తూ బూతులు తిట్టాడని ఉదోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. 

సదరు ఉద్యోగి బోర్డు మెంబర్ ను ఆపలేదని, అతని వెంట వచ్చిన అటెండర్ ను అడ్డుకున్నట్లు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. అయినా టీటీడీలో ఎలాంటి వీఐపీ అయినా బయోమెట్రిక్ నుండి మాత్రమే పంపాలని అడిషనల్ ఈఓ సిబ్బందికి ఇటీవలే ఆదేశాలిచ్చారని, దీంతో అక్కడ డ్యూటీ చేస్తున్న ఉద్యోగులు ఎవరినీ గేట్ నుండి బయటకు అనుమించడంలేదని, బోర్డు మెంబర్లు, ఉన్నతాధికారులు ఉంటే బయోమెట్రిక్ ఆధారంగా అనుమతిస్తున్నట్లు తెలిపారు.

ఉద్యోగి టీటీడీ ఆదేశాల మేరకు తన డ్యూటీ చేశాడని, కానీ వ్యక్తిగతంగా అవమానిస్తూ తిట్టడం సరికాదని, బోర్డు మెంబర్ ను ఉద్యోగం నుంచి తొలగించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

టీటీడీలో జరిగిన ఘటనను సీఎంఓ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ స్టేట్‌మెంట్‌ రికార్డు చేసింది విజిలెన్స్ శాఖ. ఈ వ్యవహారం మొత్తాన్ని సీఎంలోని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. మరోవైపు సీఎం చంద్రబాబు ఈ వివాదంపై ఆరా తీసినట్లు సమాచారం.  ఈ అంశంపై సీరియస్ యాక్షన్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది.