- సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మొద్దు: టీటీడీ ఈవో శ్యామల రావు
హైదరాబాద్, వెలుగు: తిరుమలలో తెలంగాణ నేతల సిఫార్సు లేఖలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని టీటీడీ ఈవో శ్యామలరావు సూచించారు. ఈ అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని శనివారం ప్రకటించారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భాగంగా ఈవో మీడియాతో మాట్లాడారు. వారంలో రెండు రోజుల పాటు తెలంగాణ నేతల సిఫార్సు లేఖలు అనుమతించాలని టీటీడీ నిర్ణయం తీసుకుందని శుక్రవారం ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రచారాన్ని ఈవో ఖండించారు.
అలాగే, ఇటీవల తిరుమలలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. తెలంగాణ నుంచి వచ్చే భక్తులపై, రాజకీయ నాయకులపై, వ్యాపారవేత్తలపై తేడా కనిపిస్తోందని, ఇది మంచి పరిణామం కాదని వ్యాఖ్యలు చేశారు. అయితే, అతని వ్యాఖ్యలపై న్యాయ సలహా కోరామని, రిపోర్ట్ రాగానే చర్యలు తీసుకుంటామని ఈవో స్పష్టం చేశారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడొద్దని, మాట్లాడితే చర్యలు తీసుకుంటామని ఇటీవల టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. అయితే, రూల్స్ ఉల్లంఘిస్తూ శ్రీనివాస్ గౌడ్ రాజకీయ వ్యాఖ్యలు చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని ఈవో శ్యామలరావు తెలిపారు.