
టీటీడీ గోశాలలో గత 3 నెలల్లో 100కి పైగా ఆవులు చనిపోయాయంటూ వైసీపీ కీలక నేత, టీటీడీ మాజీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం గోశాల నిర్వహణను గాలికి వదిలేసిందంటూ ధ్వజమెత్తారు భూమన. అయితే.. భూమన వ్యాఖ్యలను అటు టీటీడీ, ఇటు కూటమి ప్రభుత్వం ఖండించాయి.. ఆయన వ్యాఖ్యలు అవాస్తవమని కొట్టిపారేశాయి కూటమివర్గాలు. ఈ క్రమంలో టీటీడీ ఈఓ శ్యామలరావు భూమన వ్యాఖ్యలపై స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో ఆవులు తాగే నీళ్ళు నాచు పట్టినా కూడా పట్టించుకోలేదని.. పురుగులు పట్టి వినియోగించలేని నీళ్లు ఆవులకు పట్టించారని మండిపడ్డారు శ్యామలరావు.
గత ప్రభుత్వ హయాంలో విజిలెన్స్ అధికారులను కూడా అనుమతించలేదని.. హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశంపై జాగ్రత్తగా ఉండాల్సిందిపోయి నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు. గోశాల ఆవరణలో మెడిసిన్స్ చెల్లాచెదురుగా పడేశారని అన్నారు. గత ఐదేళ్ళలో భారీగా అక్రమాలు జరిగాయని.. చనిపోయిన ఆవుల వివరాలు దాచిపెట్టారని.. ఆవులు లేని గోశాలకు దాణా పేరుతో నిధుల దుర్వినియోగం చేశారని అన్నారు శ్యామలరావు.
Also Read : భక్తజన సంద్రంగా తిరుమల.. దర్శనానికి ఎన్ని గంటలంటే..
2024 జూన్ లో ఈఓగా బాధ్యతలు చేపట్టే ముందు సీఎం చంద్రబాబును కలిశానని.. టీటీడీ వ్యవస్థలు పాడయ్యాయని.. వాటిని సరిచేయాలని చంద్రబాబు అన్నట్లు తెలిపారు. ఈ పది నెలల్లో ఎన్నో ప్రక్షాళన కార్యక్రమాలు చేపట్టామని.. హిందువుల మనోభావాలకు అనుగుణంగా వసతులు మెరుగుపరిచామని అన్నారు శ్యామలరావు.