- గచ్చిబౌలి పీఎస్లో ఇరువర్గాల ఫిర్యాదు
గచ్చిబౌలి, వెలుగు: కొండాపూర్లోని తమ స్థలాన్ని కబ్జా చేశారని టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భార్య స్వర్ణలతారెడ్డి గచ్చిబౌలి పీఎస్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, వైవీ సుబ్బారెడ్డే తమ స్థలాన్ని కబ్జా చేసి ప్రహరీ కూల్చివేశారని మరో వర్గం ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం..
శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ లోని సర్వే నెంబర్ 87/2లో 2.08 ఎకరాల భూమిని తాము కొనుగోలు చేసి, ఎల్అండ్ టీ సంస్థకి లీజ్ఇచ్చినట్లు స్వర్ణలతారెడ్డి తెలిపారు. 2022లో ఎల్అండ్ టీ తమ స్థలాన్ని ఖాళీ చేయడంతో అప్పట్నుంచి ఖాళీగా ఉందన్నారు. గత డిసెంబర్ చివరి వారంలో అనిల్ రెడ్డి అనే వ్యక్తి తమ స్థలంలో బోర్డు పాతి కబ్జా చేశారని తెలియడంతో ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకురావాలని చెప్పినా తీసుకురాలేదన్నారు. ఆ తరువాత వారి నంబర్ కు కాల్ చేసినా స్పందించలేదని చెప్పారు. కొద్దిరోజులకు అదే స్థలంలో నర్సింహారెడ్డి పేరుతో మరో బోర్డు ఏర్పాటు చేశారు.
దీంతో తమ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని స్వర్ణలతా రెడ్డి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే , ఈ స్థలం జి. నర్సింహారెడ్డిదేనని వైవీ సుబ్బారెడ్డి దంపతులతో పాటు మరికొందరు తమ స్థలంలోకి ప్రవేశించి, సెక్యూరిటీ రూమ్, ప్రహారీ గోడ కూల్చివేశారని అక్కడ పనిచేస్తున్న సూపర్ వైజర్ షేక్ జమిల్ ఈ నెల 8న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువైపుల అందిన ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఒకవైపు వైసీపీ లీడర్ కాగా మరో వ్యక్తి తెలంగాణ రాష్ట్ర మంత్రి అల్లుడి గా తెలుస్తున్నది.