
తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. భక్తులకు ఆకలి అనేది తెలియకుండా టిటిడి ఎప్పటికప్పుడు అల్పాహారాలు, అన్నప్రసాదాలు పంపిణీ చేస్తోంది. ఎన్ని వేల మంది భక్తులు వచ్చినా ఎటువంటి ఇబ్బంది పడకుండా అన్నదానం కొనసాగిస్తోంది. సాధారణ రోజుల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు.17వ శతాబ్దంలోనే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాదానికి నాంది పలికింది.
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అన్న ప్రసాదాన్ని పంపిణీ చేస్తుంది. దీనికోసం ప్రతిరోజూ దాదాపు 15 టన్నుల బియ్యం, 10 టన్నుల కూరగాయలు వినియోగిస్తున్నారు. తిరుమలలో భక్తల రద్దీ సమయంలో ఔట్ సైడ్ లైన్ భక్తులకు అన్నప్రసాదాలు సరిగా అందండం లేదని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో తిరుమలలోని పలు ప్రాంతాలను అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరిశీలించి .. ప్రతి భక్తునికి అన్నప్రసాదం అందిస్తామని తెలిపారు.
తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ఒక్క పూట అయినా అన్నప్రసాదం తినాలని భక్తులు భావిస్తారు. తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్ లో భక్తులకు మూడు పూటలా అన్నప్రసాదాలు అందిస్తున్నారు. ఉదయం వెంగమాంబ కాంప్లెక్స్‌లో ఉదయం అల్పాహారం, మద్యాహ్నం, రాత్రి అన్నం, కూర, చట్నీ, సాంబార్, రసం, మజ్జిగ, చక్కెర పొంగలి అందిస్తారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్ 1, 2, బయట క్యూలైన్లు, పిఏసి ల దగ్గర, ఫుడ్ కౌంటర్లలో సమయాన్నిబట్డి సాంబార్ రైస్, ఉప్మా, పొంగలి, పులిహోర అందిస్తారు. టిటిడి సిబ్బందితోపాటు శ్రీవారి సేవకులు యాత్రికులకు ఆహారం అందించడం తదితర సేవలు అందిస్తున్నారు.
అయితే కొన్ని సార్లు పూర్తి స్థాయిలో భక్తులందరికి ఆహారం అందక ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కొన్ని ప్రాంతాలకు ఆహారం తీసుకువెళ్ళే మార్గం లేక తరచూ భక్తులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో ప్రతి భక్తునికి అన్నప్రసాదాలు అందించే దిశగా టిటిడి ఏర్పాట్లు చేస్తోంది. అదనపు ఈఓ వెంకయ్య చౌదరి ప్రత్యేక దృష్టి సారించారు. బయడి క్యూలైన్లను పరిశీలించి సాధ్యాసాధ్యాలను అన్ని విభాగాల అధికారులతో చర్చించారు. కొన్ని ప్రాంతాలలో కంటిన్యూగా ఆహార పదార్థాలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.