
టీటీడీ గోశాల అంశంపై ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరింది. అధికార టీడీపీ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరిస్తూ ఇవాళ ( ఏప్రిల్ 17 ) గోశాలకు బయలుదేరారు వైసీపీ కీలక నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఈ క్రమంలో భూమన ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది.. గోశాలకు బయలుదేరిన భూమనను అడ్డుకున్నారు పోలీసులు.మొదట గోశాలకు వెళ్లేందుకు టీటీడీ మాజీ చైర్మన్ భూమనకు పోలీసుల అనుమతి ఇచ్చారు. అయితే.. పోలీసుల తీరును నిరసిస్తూ ఆయన నేలపై పడుకుని నిరసన తెలిపారు భూమన.
మరోవైపు గుంపులుగా రావద్దని కూటమి నేతలను హెచ్చరించారు పోలీసులు. అయినప్పటికీ కూటమి ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, పులవర్తి నాని, సుధీర్ రెడ్డి, మురళి, జగన్ మోహన్ రావు అనుచరులతో కలిసి రావడంతో గోశాల దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా భూమన హౌస్ అరెస్టును వైసీపీ తీవ్రంగా ఖండించింది. ఈ క్రమంలో భూమానను హౌస్ అరెస్ట్ చేయలేదంటూ ఎస్పీ హర్షవర్ధన్ క్లారిటీ ఇచ్చారు. గోశాలకు వెళ్లడానికి భూమనకు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని.. రెండు పార్టీల నేతలు ఒకేసారి వెళ్లకూడదని సూచించామని అన్నారు ఎస్పీ హర్షవర్ధన్. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు గోశాలకు వెళ్లాలని సూచించినట్లు తెలిపారు ఎస్పీ.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుమలను అపవిత్రం చేస్తోందని మండిపడ్డారు భూమన. లడ్డూ కల్తీ జరిగిందని తప్పుడు ప్రచారం చేశారని.. ఇటీవల మద్యం బాటిళ్లు కూడా తిరుమలలో దొరికాయని.. కొందరు చెప్పులతో ఆలయంలోకి ప్రవేశించారని అన్నారు. తిరుమల కొండపై ఈజీగా డ్రోన్ లు ఎగరేస్తున్నారని అన్నారు. గోశాలలో ఆవులు మరణిస్తున్న కూడా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు భూమన. ఇలాంటి తప్పులను ప్రశ్నిస్తున్న తమపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారని అన్నారు భూమన.