కలియుగ వైకుంఠం తిరుమలలో స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉంటారు సామాన్య భక్తులు. రద్దీని బట్టి ఒక్కోసారి 24 గంటల కంటే ఎక్కువ సమయం కంపార్టుమెంట్లలో వేచి ఉన్న దాఖలాలు చాలానే ఉన్నాయి. అయితే.. ఇకపై సామాన్య భక్తులకు ఈ ఇబ్బంది లేకుండా కేవలం 3 గంటల్లోనే శ్రీవారి దర్శనం అవుతుంది. ఈ మాట వింటేనే స్వామివారి దర్శనం చేసుకున్నంత ఆనందంగా ఉంది కదా.. అవును, నిజమే.. సామాన్య భక్తులకు 3 గంటల్లోనే దర్శనం కల్పించేలా చర్యలు చేపట్టాలని టీటీడీ నిర్ణయించింది.
టీటీడీ నూతన చైర్మెన్ బీఆర్ నాయుడు నేతృత్వంలో జరిగిన 54వ టీటీడీ పాలకమండలి సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంది పాలకమండలి. ఈ క్రమంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పాలకమండలి సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు వెల్లడించారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ సహాయంతో సామాన్య భక్తులు మూడు గంటల్లో దర్శన భాగ్యం కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
అంతే కాకుండా అన్యమత ఉద్యోగుల విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు బీఆర్ నాయుడు. అన్యమత ఉద్యోగస్తులతో చర్చలు జరిపి.. విఆర్ఎస్ తీసుకుంటే విఆర్ఎస్ ఇస్తామని, లేకుంటే ఇతర శాఖలకు బదిలీ చేస్తామని అన్నారు. శ్రీనివాస సేతు కు గరుడ వారధిగా పేరు మార్చాలని నిర్ణయించినట్లు తెలిపారు.
దేవలోక్ ప్రాజెక్ట్ కోసం 20 ఎకరాలు ఇవ్వడం జరిగిందని, ఆ స్థలంలో ఇప్పుడు ముంతాజ్ హోటల్ కన్స్ట్రక్షన్ చేపట్టారని అన్నారు. ఆ ప్రభుత్వ స్థలాన్ని టీటీడీకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు. తిరుమలలో రాజకీయ ప్రసంగాలు నిషేదించాలని.. మాట్లాడితే కేసులు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ప్రతి నెల మొదటి మంగళవారం స్థానికులకు దర్శన భాగ్యం కల్పిస్తామని అన్నారు. శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేసి వేరొక ట్రస్ట్ లో విలీనం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రైవేట్ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లను గవర్నమెంట్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని, నిత్య అన్నదానంను మరింత మెరుగుపరిచేలా.. మెనూలో మరిన్ని ఆహార పదార్థాలు అందుబాటులో తీసుకొస్తామని తెలిపారు.
టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వాలని, శాశ్వత ఉద్యోగులకు రూ. 17వేల 400 కాంట్రాక్టు ఉద్యోగులకు రూ. 7వేల 530 బ్రహ్మోత్సవ బహుమానంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. శారదాపీఠంకు ఇచ్చిన స్థలాన్ని పూర్తిగా రద్దు చేసి.. టీటీడీ స్వాధీనం చేసుకోనున్నట్లు తెలిపారు బీఆర్ నాయుడు.టూరిజం టికెట్లలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయని.. వాటిని పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు చైర్మెన్ బీఆర్ నాయుడు.