తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు.. భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ

తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు.. భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ

కలియుగ వైకుంఠం తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. మంగళవారం ( ఫిబ్రవరి 4, 2025 ) జరగనున్న ఈ వేడుకలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసు అధికారులు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. స్థానిక ఎస్వీ హైస్కూల్ లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ సిబ్బందికి కీలక సూచనలు చేశారు ఎస్పీ హర్షవర్ధన్. ఈ వేడుకలకు సుమారు 2 లక్షలు పైగా భక్తులు హాజరవుతారని... తదనుగుణంగా సుమారు 1400 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు.

మంగళవారం ( ఫిబ్రవరి 4, 2025 ) ఉదయం 5: 30 గంటలకు సూర్యప్రభ వాహనంతో  ప్రారంభమయ్యే ఈ వేడుకలలో గరుడ వాహనం, చక్ర స్నానానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని... దానికి అనుగుణంగా బందోబస్తు పోలీసు అధికారులు, సిబ్బంది సిద్దంగా ఉండాలని అన్నారు. పోలీసులు భక్తులతో గౌరవంగా, మర్యాదపూర్వకంగా మెలగి రథసప్తమి రోజున ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకొనే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు ఎస్పీ.

ALSO READ | తిరుమల అప్​డేట్​ : ఒకే రోజు ఏడు వాహనాలపై శ్రీవారి దర్శనం.. ఎప్పుడంటే..

చిన్నపిల్లలు తప్పిపోకుండా ఉండేందుకు పిల్లలకు తప్పనిసరిగా వారి తల్లిదండ్రుల వివరాలు, ఫోన్ నెంబర్లను తెలియజేసే జియో ట్యాగింగ్ ను అమలు చేస్తున్నామని... దయచేసి పిల్లల తల్లిదండ్రులు పోలీసులకు సహకరించి, ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఎస్పీ హర్షవర్దన్.తిరుమల లో అన్ని పార్కింగ్ ప్రాంతాలు నిండిపోతే తిరుపతి లోనే పార్కింగ్ చేసే విధంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ గారు భక్తులకు తెలియజేశారు.

అదేవిధంగా ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పోలీసులకు సహకరించాలని, పోలీసులే చొరవ తీసుకొని అన్ని శాఖల యంత్రాంగాన్ని సమన్వయపరచుకుంటూ రథసప్తమి వేడుకలను విజయవంతం చేయాలని సూచించారు.