
తిరుమల భక్తులకు టీటీడీ అందిస్తున్న సేవలను బాగున్నాయని ఏపీ అసెంబ్లీ అంచనాల కమిటి చైర్మన్ వేగుల్ల జోగేశ్వరరావు తెలిపారు. గతంతో పోలిస్తే ..ఇప్పుడు చాలా మార్పు కనిపిస్తుందని ఆయన అన్నారు. ఇంకా మెరుగైన సేవలు అందించేందుకు ఏపీ అసెంబ్లీ అంచనాల కమిటి కొన్ని సూచనలు చేసింది.
తిరుమలలో నిర్వహించే శ్రీవారి సేవల వివరాల గురించి క్రమం తప్పకుండా టీటీడీ ప్రకటనలు ఇవ్వాలని సూచించింది. టీటీడీ ప్రతి వసతి గృహాంలో అన్ని చోట్ల శ్రీవేంకటేశ్వర స్వామి, శ్రీపద్మావతి అమ్మవారి చిత్ర పటాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్వామివారి కీర్తనలు, గోవింద నామాలు రాత్రి 10 గం.ల వరకు వినిపించేలా చర్యలు తీసుకోవాలని సభ్యులు ఈవోను కోరారు. ఈ విషయంలో ఇప్పటికే ప్రత్యేక చర్యలు చేపట్టామని, మరింత పటిష్టంగా అమలు చేస్తామని ఈవో చెప్పారు. వసతి గదుల నిర్వహణపై నిత్యం పర్యవేక్షణ ఉండాలని సభ్యులు సూచించారు.యూత్‌కు శ్రీవారి వైభవాన్ని తెలియజేసేలా డిజిటల్ మీడియాను మరింత బలోపేతం చేయాలని ఏపీ అసెంబ్లీ అంచనాల కమిటి సూచించింది.
తిరుమలలో వసతి గదుల నిర్మాణాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానం ఇస్తూ... కాషన్ డిపాజిట్ ను భక్తులకు సకాలంలో చెల్లించేందుకు మరింత పటిష్ట చర్యలు చేపట్టామన్నారు. ఒకరి పేరుతో వసతి గది తీసుకుని మరొకరు వచ్చి ఫేస్ రికగ్నిషన్ కాకపోవడం వల్ల చెల్లింపులో ఆలస్యం కావడం మినహా.. కాషన్ డిపాజిట్ ను సంబంధిత వ్యక్తులకు సకాలంలో చెల్లింపు చేస్తున్నామన్నారు.
టీటీడీ ఆధ్వర్యంలో తయారు చేస్తున్న స్వామివారి, అమ్మవారి రాతి విగ్రహాల తయారీ, పంపిణీ వివరాలను సభ్యులకు తెలియజేశారు ఈవో శ్యామలరావు. హిందూ ఆలయాలకు 5 అడుగుల లోపు స్వామివారు, అమ్మవారి విగ్రహాలను ఉచితంగా అందిస్తామని, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఎస్సీ, ఎస్టీ, మత్స్యకారుల ప్రాంతాలలో ఉచితంగా సప్లయ్ చేస్తామని ఈవో చెప్పారు.
టీటీడీలోజరుగుతున్న సేవలపై సభ్యులు సంతృప్తి చెందగా.... తిరుమలలో పరిశుభ్రత, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సేవలు అందుతున్నాయన్నారు.