
తిరుమలలో టీటీడీ కీలక నిర్ణయాలకు సిద్ధమైంది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది బోర్డు. ఈ సందర్భంగా బ్రేక్ దర్శనాలను కుదించాలని నిర్ణయించారు. అదేవిధంగా సిఫారసు (రెకమెండేషన్) లేఖల విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకోనున్నారు. సిఫార్సు లేఖల ఆమోదం విషయంలోనూ మూడు నెలల పాటు కీలక నిర్ణయాలు అమలు చేయనున్నారు.
తిరుమలలో గత కొన్ని రోజుకుగా రద్దీ క్రమేణా పెరుగుతోంది. ఉగాది పండుగతో పాటు వరుస సెలవులు ఉండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉండాల్సి వస్తోంది. దీంతో ఉచిత సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది.
ఇక SSD దర్శనానికి సుమారు 6 గంటలు, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతోంది. శనివారం (మార్చి 29) శ్రీవారిని 76 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. 22 వేల 7 వందల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శనివారం నాడు శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.80 కోట్లు వచ్చాయని అధికారులు తెలిపారు.
ప్రతీ ఏటా వేసవి రద్దీ తిరుమలలో ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది ముందస్తు చర్యలు చేపట్టాలని టీటీడీ నిర్ణయించింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ వీఐపీ బ్రేక్ దర్శనాలను కుదించేలా నిర్ణయం వెల్లడించేందుకు సిద్దమైంది. ఏప్రిల్ నుంచి జూన్ 30వ తేదీ వరకు సిఫారసు లేఖలు తగ్గించి సామాన్యులకు ప్రాధాన్యం కల్పించడం కొంతకాలంగా కొనసాగుతోంది. ప్రతిరోజూ వీఐపీ బ్రేక్ దర్శనాలు ఐదు వేలు, శ్రీవాణి 1500, దాతలు, వర్చువల్ ఎస్‌ఈడీల దర్శనాలు దాదాపు మరో ఐదు వేల వరకు టికెట్లను ఇస్తున్నారు.
ALSO READ | Srisailam: శ్రీశైలంలో కన్నుల పండువగా ఉగాది మహోత్సవాలు.. నంది వాహనంపై ఆది దంపతుల దర్శనం
ఈ సమయంలోనే టీటీడీ మరో కీలక నిర్ణయానికి సిద్దమైంది. ప్రస్తుతం బ్రేక్ దర్శనాల కారణంగా సామాన్య భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోంది. దీంతో.. ఏప్రిల్ మొదటి వారం నుండి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, స్థానిక అధికారులు, చిన్న చిన్న ప్రభుత్వ సంస్థలకు ఇచ్చే సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది. కేవలం స్వయంగా వచ్చే అధికారులకు మాత్రమే అవకాశం కల్పిస్తారని సమాచారం. ఈ అంశంపైన టీటీడీ ఇప్పటికే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు. ఒకేసారి రద్దు చేయకుండా ముందస్తు సమాచారంతో నిర్ణయం అమలు చేయాలని భావిస్తున్నారు.