సూర్య జయంతిని పురస్కరించుకుని రథసప్తమి వేడుకలకు ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల ముస్తాబైంది. 2025, ఫిబ్రవరి 4వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. సూర్య జయంతి సందర్భంగా తిరుమల మాడవీధుల్లో ఒకే రోజు ఏడు వాహనాలలో స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అందుకే రథసప్తమిని మినీ బ్రహ్మోత్సవం అంటారని పండితులు తెలిపారు.
రథసప్తమి రోజు వేకువజాము నుంచి రాత్రి వరకు స్వామివారు వివిధ వాహనాలలో భక్తులకు కనువిందు చేయనున్నారు. ఈ వేడుకను తిలకించడానికి లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలి వచ్చే అవకాశం ఉందని టీటీడీ అధికారులు తెలిపారు. రధసప్తమి వేడుకలకు టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు.. రధసప్తమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న పలు ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది.
కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేస్తు్న్నట్లు వెల్లడించింది. ఇటీవల తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాట జరిగి భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా టీటీడీ పకడ్భందీగా ఏర్పాట్లు చేస్తోంది.
మినీ బ్రహ్మోత్సవం అంటే..?
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీనివాసుడు. ఈ కలియుగ దైవాన్ని క్షణకాలం పాటు చూడటానికి భక్తులు పరితపిస్తూ ఉంటారు. సాధారణంగా తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. వార్షికోత్సవం లో భాగంగా బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా తొమ్మిది రోజులు జరిగితే, స్వామివారు 16 వాహనాలలో దర్శనం ఇస్తారు.. కాని మినీ బ్రహ్మోత్సవంగా పిలిచే రథసప్తమి పర్వదినాన ఒకే రోజు ఏడు వాహనాలలో శ్రీవారు భక్తులకు దర్శనం ఇస్తారు.. ఫిబ్రవరి 4న తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి..
రధసప్తమి వేడుకల వివరాలు:
- ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహన సేవ...
- ఉదయం 9 నుంచి 10 గంటల వరకు - చిన్నశేష వాహనం
- ఉదయం 11 నుంచి 12 గంటల వరకు - గరుడ వాహనం
- మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు - హనుమంత వాహనం
- మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు - చక్రస్నానం
- సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు - కల్పవృక్ష వాహనం
- సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు - సర్వభూపాల వాహనం
- రాత్రి 8 నుంచి 9 గంటల వరకు -చంద్రప్రభ వాహనం