తిరుమలలో చెప్పుల తిప్పలకు చెక్.. చెప్పుల స్టాండ్ల దగ్గర విడిచి వెళ్లండి.. ఇకపై మీ చెప్పులు ఎక్కడికీ పోవు..!

తిరుమలలో చెప్పుల తిప్పలకు చెక్.. చెప్పుల స్టాండ్ల దగ్గర విడిచి వెళ్లండి.. ఇకపై మీ చెప్పులు ఎక్కడికీ పోవు..!

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళే భక్తులు ఎవరూ చెప్పులు ధరించరు. తిరు మాఢ వీధులలో కూడా భక్తులు చెప్పులు వేసుకుని నడవరు. శ్రీవారి ఆలయ పరిసరాలు, అన్నదానం ప్రాంతాలను భక్తులు అంత పవిత్రంగా భావిస్తారు. దీంతో తిరుమల వచ్చిన భక్తులకు చెప్పులు ఎక్కడ వదలాలి అన్నది పెద్ద టాస్క్ అని చెప్పాలి.

అందుకోసం తిరుమలలోని పలు రద్దీ ప్రాంతాలలో టీటీడీ చెప్పుల స్టాండ్లు ఏర్పాటు చేసింది. రాంబగీచా, అన్నదానం, ఏటీసీ సర్కిల్, కళ్యాణకట్ట తదితర ప్రాంతాలలో చెప్పుల స్టాండ్లు ఉన్నాయి. అయినా తిరుమలలో చాలా ప్రాంతాలలో చెప్పులు కుప్పలు కుప్పలుగా కనిపిస్తుంటాయి. చెప్పుల స్టాండ్లు చూస్తే అదో పద్మవ్యూహాన్ని తలపిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి కాదేమో. అక్కడ చెప్పులు వదలడమేగాని తిరిగి వాటిని మనం కనుక్కోవడం అసాధ్యం.

దీంతో.. ఈ చెప్పుల సమస్యపై టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి దృష్టి సారించారు. చెప్పుల సమస్యకు శాశ్వత పరిష్కారం ఆలోచించారు. ప్రస్తుతం టీటీడీ ఉచిత లగేజి కౌంటర్లో ఉపయోగించే ఆర్ఎఫ్ఐడి సిస్టం అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. పైలెట్ ప్రాజెక్టుగా ఏటీసీ సర్కిల్లో ఒక కౌంటర్ను ఏర్పాటు చేశారు. కౌంటర్ పనితీరును అధికారులతో కలిసి పరిశీలించారు. భక్తుల చెప్పులు వదిలి వెళ్లేటప్పుడు వారి ఫోటోతోపాటు మొబైల్ నెంబర్ ఫీడ్ చేసి స్లిప్ ఇస్తారు. చెప్పులను ఆర్ఎఫ్ఐడి ఉన్న బ్యాగ్ లో వేసి ర్యాక్ నెంబర్ ఆధారంగా స్కాన్ చేసి భద్రపరుస్తారు.

►ALSO READ | ఈ సమ్మర్ హాలిడేస్లో తిరుమలకు వెళ్లే ప్లాన్లో ఉన్నారా..? అయితే ఈ వార్త మీ కోసమే..

భక్తులు దర్శనం అయ్యాక తిరిగి వచ్చి స్లిప్ చూపిస్తే స్కాన్ చేసి కౌంటర్లో, ఏ వరుసలో ఏ ర్యాక్లో ఆనంబర్ గల చెప్పులు ఉన్నాయో ఈజీగా గుర్తించి భక్తులకు తిరిగి అందిస్తున్నారు సిబ్బంది. అటు భక్తులను, ఇటు టీటీడీ సిబ్బంది నుంచి అదనపు ఈఓ వెంకయ్య చౌదరి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. 98 శాతం మంది భక్తులు తమ చెప్పులను తిరిగి తీసుకువెళుతున్నామని చెప్పారు. దీంతో నూతన విధానం విజయవంతంగా అమలవుతోందని, మరో నాలుగు ప్రాంతాలలో ఇదే తరహాలో చెప్పుల కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి తెలిపారు.