భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో సీజ్ చేసిన దాదాపు 11,061కిలోల గంజాయిని పోలీసులు మంగళవారం కాల్చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడారు. 17 పోలీస్ స్టేషన్ల పరిధిలో 142కేసుల్లో 11,061కేజీల గంజాయిని పట్టుకున్నామని తెలిపారు. దాన్ని కోర్టు ఆదేశాలతో డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో హేమచంద్రాపురం సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో దహనం చేశామన్నారు.
ఈ గంజాయి విలువ దాదాపు రూ. 27కోట్లు ఉంటుందన్నారు. యువతను మత్తులోకి దించుతున్న గంజాయిని తరిమి కొట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గంజాయి అమ్మకాలు, రవాణా చేసే వారి వివరాలను పోలీసులకు అందించాలని చెప్పారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను రహస్యంగా ఉంచుతామన్నారు. గంజాయిని అడ్డుకునేందుకు నిఘా బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ సాయి మనోహార్, ఏఎస్పీ పరితోష్ పంకజ్, డీఎస్పీలు వెంకటేశ్,రాఘవేంద్రరావు, డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్య స్వామి, సీఐలు వెంకటేశ్వర్లు నాగరాజు పాల్గొన్నారు.