చామల వర్సెస్ రోహిన్ రెడ్డి

  • పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు కోసం టగ్ ఆఫ్ వార్
  • ఇద్దరూ సన్నిహితులే కావడంతో తేల్చుకోలేకపోతున్న సీఎం రేవంత్
  • పీసీసీ కార్యవర్గం కొలిక్కి వచ్చినా.. ఈ ఒక్క పోస్టుపైనే పెండింగ్

హైదరాబాద్, వెలుగు: భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.. ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తున్నది. ఈ ఇద్దరు సీఎం రేవంత్ రెడ్డికి కుడి, ఎడమలే.. ఒకరికి ఔనంటే మరొకరు నొచ్చుకుంటారేమోనని రేవంత్ వీరి విషయంలో ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. త్వరలోనే పీసీసీ కార్యవర్గం ప్రకటించేందుకు పార్టీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సిద్ధమయ్యారు. దాదాపుగా మొత్తం కార్యవర్గం జాబితా రెడీ అయింది.

 ఒక్క పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుపైనే ఇటు సీఎం స్థాయిలో అటు పీసీసీలో పేచీ నడుస్తున్నది. కొత్త కార్యవర్గంలో మూడు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు ఉంచాలని పార్టీ నిర్ణయించింది. ఇందులో ఒకటి ఎస్సీకి, మరోటి ఎస్టీకి ఖరారు చేశారు. ఇక మూడోది రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలని నిర్ణయించారు. దీని కోసం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. తన ఆసక్తిని సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు. మొదట్లో సీఎం రేవంత్ చామలకే ఓకే అనేశారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల్లో ఒకటి చామలకే పక్కా అని పార్టీలో కూడా ప్రచారం సాగింది.

అయితే చివర్లో రోహిన్ రెడ్డి ఎంటరయ్యాడు. నిత్యం సీఎం రేవంత్ పక్కనే ఉండే ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్.. ఇప్పుడు పీసీసీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై పట్టుపడుతున్నాడు. దీంతో ఈ విషయంపై సీఎం నిర్ణయం కోసం పార్టీ ఎదురుచూస్తున్నది. కార్యవర్గంలోని మిగితా రెండు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల విషయంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ దీపాదాస్ మున్షి జోక్యం చేసుకున్నా.. మూడో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు విషయం ఆమె కూడా సీఎం రేవంత్ నిర్ణయానికే వదిలేశారు.

అంతలా పట్టుపట్టడం ఎందుకంటే

వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల్లో మూడోది దక్కించుకునేది సీఎం సన్నిహితుల్లో ఎవరనేది పీసీసీలో ఆసక్తికర చర్చకు తెరలేసింది. చామల ఎంపీగా ఉన్నారు, సీఎం కు సన్నిహితుడనే ముద్ర ఉంది.. రోహిన్ సీఎంను వె న్నంటే ఉంటారు. ఒక అధికారిక కార్యక్రమాల్లో తప్ప సీఎం ఎక్కడ ఉంటే ఆయన అక్కడే ఉంటారు. మరి ఇంతటి ప్రభావాన్ని చూపే ఈ ఇద్దరు వ్యక్తులు కేవలం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు కోసం అంతలా పట్టుపట్టడం ఏమిటనే అనుమానాలు చాలా మందికి వస్తున్నాయి.

అయితే దీనికో లెక్క ఉంది. కాంగ్రెస్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ అంటేనే లక్కీ పోస్టుగా భావిస్తారు. ఎందుకంటే.. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్.. ఈ నేతలంగా వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు చేపట్టిన తర్వాతనే రాజకీయంగా ఈ స్థాయికి ఎదిగారు. అందుకే ఈ పోస్టు కోసం చామల కిరణ్.. రోహిన్ మధ్య ఇప్పుడు వార్ నడుస్తున్నది. మరి ఇద్దరిలో సీఎం మొగ్గు ఎవరికి ఉంటుందనే ఉత్కంఠ పీసీసీలో కొనసాగుతోంది.