గురువు 22.03.2023 నుంచి 21.04.2023 వరకు షష్టమందు వ్యయములో తదుపరి ఉగాది వరకు సప్తమంలో లోహముర్తిగా సమాచారం. శని 22.03.2023 నుంచి 08.04.2024 వరకు పంచమంలో రజితమూర్తిగా సంచారం. రాహువు 22.03.2023 నుంచి సప్తమంలో లోహమూర్తిగాను తదుపరి ఉగాది వరకు వ్యయంలో లోహమూర్తిగా సంచారం. కేతువు 30.10.2023 నుంచి ఉగాది వరకు వ్యయ స్థానంలో సంచారం.
ఈ రాశి స్త్రీ పురుషులకు అనుకూలం. పరిస్థితులు ఆశాజనకం. రైతులు తిథి నక్షత్రాలు చూసుకొని అరక దున్నితే ఆశించిన అధిక దిగుబడి రాగలదు. వృత్తి వ్యాపారులకు అనుకూలం. కానీ, ధనం కనిపించదు. డాక్టర్లు, లాయర్లకు అమృతం సేవించినంతగా ఆకస్మిక ధన యోగం. వాస్తు కలిగిన గృహంలో ఉన్న కాంట్రాక్టర్లకు అనుకూలం. రాజకీయ నాయకులకు ప్రజాదరణ, గౌరవం. చిన్న, పెద్ద పరిశ్రమల వారికి ధనాదాయం. వెండి, బంగారం, ఇనుము, కాపర్, టింబర్, సిమెంట్ ధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. వస్త్ర వ్యాపారులు, ఫ్యాన్సీ వ్యాపారులకు సామాన్యం. కెమికల్, సుగంధ ద్రవ్యాల వ్యాపారులకు అనుకూలం. పాడి పరిశ్రమ, మత్స్య, పౌల్ట్రీ ఇండస్ట్రీల వారికి ఖర్చులు అధికం. చిట్స్, ఫైనాన్స్, షేర్స్ వారికి సామాన్యం. ఈ సంవత్సరం వ్యాపారంలో లాభాలు వచ్చినట్లుగా కాగితాలపై ఉంటుంది. కానీ, డబ్బు రూపంలో కనిపించదు. అన్నింటిలో శుభం జరుగుతుంది. నూతన ఉద్యోగంలో అనుకూలం. ఇష్టంగా చదివిన విద్యార్థులకు అధిక మార్కులు వస్తాయి. ఆరోగ్యమే మహాభాగ్యం. శని ప్రభావం వలన దగ్గర వారితో కోర్టు కేసు సమస్యలు. శనికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల బంధువర్గంతో సఖ్యత. తొందరపాటు వల్ల సమస్యలు. సుబ్రమణ్యేశ్వర స్వామికి అభిషేకం, హోమం చేయడం వల్ల సమస్యలు తగ్గుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యంపైనా శ్రద్ధ పెట్టండి. ప్రధానంగా గృహంలో అఖండ దీపారాధన చేయడం వలన స్థాన చలనానికి బ్రేకులు పడతాయి. ఉద్యోగులకు స్థాన చలనం ఉంది. వివాహ ప్రయత్నాలు ఫలించును. టీవీ ఆర్టిస్టులకు, సినిమా వారికి అనుకూలం. వ్యవసాయం తర్వాత చేనేత రంగం వారిని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు గుర్తిస్తాయి. చిత్త నక్షత్రం వారు పగడం ధరించి సుబ్రమణ్యేశ్వర స్వామికి పూజ చేయాలి. స్వాతి నక్షత్రం వారు గోమేధికం ధరించాలి. దుర్గాదేవి ఆరాధన అష్టోత్తర, సహస్ర నామాలు, కుంకుమ పూజలు చేయాలి. విశాఖ నక్షత్రం వారు కనక పుష్య రాగం ధరించాలి. దక్షిణామూర్తికి, సాయిబాబాకు శనగ గుగ్గిళ్లు చేసి, కొబ్బరికాయ కొట్టి పూజలు చేయాలి. అనంతరం సాయిబాబా దేవాలయంలో స్వామివారి ప్రసాదాన్ని పంచాలి. నవగ్రహ ప్రదక్షిణలు, మహాన్యాస రుద్రాభిషేకం చేయించుకుంటే ఆరోగ్యం విషయంలో అనుకూలం. ఎవరికీ హామీదారుగా ఉండొద్దు. అమ్మవారికి పూజలు చేయడం వల్ల ఆర్థిక బాధలు తొలగిపోతాయి. మీరు నమ్మి ఆచరించండి. నిరంతం ఇష్టంగానే పని చేయండి. అదృష్ట సంఖ్య 6.
తుల రాశి మాస ఫలితాలు
చైత్ర మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు సామాన్యం. అయినా మీరు అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. కార్యదీక్ష కలిగి ముందుకు సాగండి. సాధారణ విషయమే కదా అని దేన్నీ నిర్లక్ష్యం చేయొద్దు. భవిష్యత్ ప్రణాళికను చక్కగా ప్లాన్ చేసుకోండి. దైవారాధన, నిత్య దీపారాధన చాలా అవసరం.
వైశాఖ మాసం: ఆకస్మిక ధన ఆదాయంతో పాటు ఖర్చులు కూడా ఉంటాయి. ఎంత ఆదాయం వస్తుందో, ఎంత ఖర్చవుతుందో అర్థం కాదు. పిల్లల విదేశీ విద్యకు డబ్బు సమకూరుతుంది. ఖర్చులపైన నిఘా పెట్టి, డబ్బు దుబారా కాకుండా ప్రయత్నించాలి. సుబ్రమణ్యేశ్వర స్వామిని పూజించండి.
జ్యేష్ఠ మాసం: ఆకస్మిక ప్రమాదాలు ఉన్నవి. కుజ జపం, నవగ్రహ ప్రదక్షిణాలు, సుబ్రమణ్యేశ్వర స్వామికి హోమం చేయించండి. శకునం చూసి బయలుదేరండి. మహా మృత్యుంజయ మంత్రం చదవండి.
ఆషాఢ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు అనుకూలం. నవగ్రహ ప్రదక్షిణాలు చేయండి. ప్రతి విషయంలో కార్యానుకూలత. విద్యార్థులకు అనుకూలం. ఎవరికి వారు ప్రతి విషయంలో సామరస్యంగా పట్టు సాధించగలరు.
అధిక శ్రావణ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు అనుకూలంగా ఉంటుంది. ఎవరితోనైనా సామరస్య ధోరణితో ఉండాలి. వినయ విధేయతలతో సాధించ లేనిదంటూ ఏదీ లేదు. నవగ్రహ ఆరాధన తప్పనిసరి. ప్రయత్న లోపం తప్ప జరగనిది ఏదీ లేదు. గృహంలో మాట పట్టింపులు వద్దు. శరవణభవ మంత్రాన్ని జపించండి.
నిజ శ్రావణ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులు కొన్ని విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. వివాదాలకు అవకాశం ఇవ్వరాదు. కుటుంబసభ్యుల సహకారంతో కార్యసాధనలో సాధించలేనిది ఏమీ లేదు. లౌకికంగా తప్పనిసరిగా ఈ నియమాలు పాటించాలి. ఇష్టదైవానికి దీపారాధన చేయాలి.
భాద్రపద మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు గ్రహాల కలయిక లేక మిత్రులు, శత్రువులుగా మారుతారు. గతంలో జరిగినవి గుర్తుచేసుకుని ఏదో ఒక విషయంలో కక్ష సాధించే ప్రయత్నం చేస్తారు. అధికారులు, తోటివారితో జాగ్రత్తగా మాట్లాడండి. లక్ష్మీ విఘ్నేశ్వర పారాయణం, సుదర్శన హోమం చేయించండి.
ఆశ్వయుజ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు ప్రతి విషయంలో అవరోధాలు. నవగ్రహ ఆరాధనతో పాటు ప్రతి రోజు ఆదిత్య హృదయ పారాయణం చేయాలి. సుబ్రమణ్యేశ్వర స్వామి ఆరాధన వల్ల రాబోయే ఉపద్రవాలు ఆగిపోతాయి. మీరు నమ్మినప్పుడు ఫలితం పక్కనే ఉంటుంది. మీకున్న పనులు నెరవేరుటకు అనారోగ్య సమస్యలు ఎదురుకావు.
కార్తీక మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు అనుకూలంగా ఉంటుంది. పట్టుదలతో పనులు సాధించుకునేందుకు అనుకూలమైన సమయం. అగ్రిమెంట్లు, కోర్టు తగాదా కేసులు రాజీ మార్గంలో పరిష్కరించుకొనుట మంచిది. ఇంటా బయట తక్కువగా మాట్లాడి కార్యసాధన చేయండి. విద్యార్థులు సరస్వతీ ద్వాదశ నామాలు పఠించండి.
మార్గశిర మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు చాలా సంతృప్తికం. దైవ బలంతో ప్రతి వ్యతిరేక విషయాన్ని మీకు అనుకూలంగా మార్చుకుంటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన ఆభరణాలు, వస్తు వాహన యోగములు సమకూర్చుకునేందుకు ఇది సరైన సమయం. సత్యదేవుని వ్రతం చేయడం మంచిది.
పుష్య మాసం: అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. గృహంలో వ్యతిరేక భావాలు, ప్రతిపక్ష ధోరణి కలిగి ఉండి కొంత మనసును బాధపెట్టే విషయాలు జరిగే అవకాశం ఉంది. మీ ప్రయత్నంగా మాటలను చాలా పొదుపుగా వాడండి. మహాన్యాస రుద్రాభిషేకం చేయడం మంచిది.
మాఘ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు సామాన్యంగా ఉంటుంది. బంధు మిత్రుల కలయిక వల్ల సంతోషంగా ఉంటారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఉన్నాయి. దీర్ఘకాలిక ఆలోచనలతో ఎంతపెద్ద సమస్య వచ్చినా అదరక బెదరక మనో నిగ్రహంతో ఉండి చాకచక్యంగా
పరిష్కరించుకుంటారు. అమ్మవారి పూజలు అనంతమైన శక్తిని ఇస్తాయి.
ఫాల్గుణ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు సామాన్యంగా ఉంటుంది. అలాగని నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు. మీరు ముందస్తు ప్లానింగ్‌తో ఉంటారు. కార్యసాధనలో ఉత్సాహంగానే ఉండగలరు. మీరేం అమాయకులు కాదు. కానీ, కాల మహిమ కదా.. కాలానుగుణంగా కొనసాగండి. ఇష్ట దేవతలకు పూజలు తప్పనిసరిగా చేయాలి. ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది.