బండి సంజయ్పై తుల ఉమ సంచలన వ్యాఖ్యలు

వేములవాడ బీజేపీ టికెట్ ఆశించి భంగపడిన తుల ఉమ.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అనుచరులతో సమావేశమైన తుల ఉమ బండి సంజయ్ పై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీలో మహిళలకు స్థానం లేదన్నారు. బీసీలను అణగదొక్కాలని చూస్తున్నారని, అగ్రవర్ణాలకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. టికెట్ విషయంలో తనను నమ్మించి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ లో ఓ దొర అహంకారంతో తాను పార్టీ నుంచి బయటకు వచ్చానని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకున్నానని, తనకు బీజేపీలో మోసం జరిగిందన్నారు.

బీజేపీలో బీసీ ముఖ్యమంత్రి అనేది బూటకం అని ఆరోపించారు తుల ఉమ. కొందరు దొరలు కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దొరల కాళ్ల దగ్గర ఎంపీ బండి సంజయ్ బీ ఫామ్ పెట్టి వచ్చారని ఆరోపించారు. దొరల వద్ద చేతులు కట్టుకొని ఉండలేనన్నారు. బీజేపీ పార్టీలో సిద్దాంతాలు లేవన్నారు. తన భవిష్యత్తు కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తానని స్పష్టం చేశారు. తాను ఏ పార్టీలో చేరాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, వేములవాడ ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు.