వేములవాడ బీజేపీ టికెట్ ఆశించి భంగపడిన తుల ఉమ.. బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సోమవారం (నవంబర్ 13న) ఉదయం బీజేపీ పార్టీ సభ్యత్వానికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పదవికి తుల ఉమ రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి పంపించారు. అనంతరం ఆమె తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. కేటీఆర్ ఆమెకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
వేములవాడ బీజేపీ టికెట్ ఇస్తామని ముందుగా చెప్పడంతో తుల ఉమ ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేసుకున్నారు. నామినేషన్ వేసే సమయంలో ఆమెకు బీజేపీ నాయకులు షాక్ ఇచ్చారు. చివరి లిస్టులో తుల ఉమ పేరు ప్రకటించిన బీజేపీ అధిష్ఠానం.. ఆ తర్వాత మార్పులు చేసింది. చివరి నిమిషంలో తుల ఉమ అభ్యర్థిత్వాన్ని క్యాన్సిల్ చేసి.. వికాస్‌రావుకు టికెట్ ఇచ్చింది. దీంతో తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. పార్టీ నాయకులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ తనను మోసం చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ALSO READ :- మాట ఇచ్చింది మోదీ.. ఎస్సీ వర్గీకరణ చేసి చూపిస్తరు: కిషన్ రెడ్డి