వేములవాడ, వెలుగు : టికెట్ఇస్తామని మోసగించిన బీజేపీ లీడర్లు తనకు ఎవరైనా ఫోన్ చేస్తే చెప్పుతో కొడతానని జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ ఫైర్ అయ్యారు. తనకు టికెట్ఇచ్చినట్టు ప్రకటించి బీఫాం ఇవ్వకుండా అవమానించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం వేములవాడలోని తన నివాసంలో తుల ఉమ మీడియాతో మాట్లాడారు. ఎంపీ బండి సంజయ్ మాట్లాడితే బీసీలు అంటారని, బీఫాం మాత్రం దొరల కాళ్ల దగ్గర పెట్టారని విమర్శించారు. బీజేపీలో మహిళలకు స్థానం లేదన్నారు. తన చిన్నతనంలోనే దొరల నుంచి విముక్తి కోసం కొట్లాడానని, బీఆర్ఎస్లో కూడా ఓ దొర అహంకారం వల్ల బయటకు వచ్చానన్నారు. బీజేపీలోనూ కుటుంబ పాలనే ఉందన్నారు. వ్యక్తుల పూజలే ఎక్కువయ్యాయని మండిపడ్డారు. బీసీ సీఎం అనేది బూటకమని విమర్శించారు.
కిషన్రెడ్డి, సంజయ్, ఈటల దిష్టిబొమ్మలు దహనం
బీజేపీకి బుద్ధి చెబుతామని కురుమ యువ చైతన్య సమితినేత ఎమ్మె మహేందర్ కురుమ అన్నారు. ఈమేరకు మహేందర్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు వేములవాడలో కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల దిష్టిబొమ్మలను దహనం చేశారు. బీజేపీ అభ్యర్థులు గెలవకుండా బీసీలంతా కృషి చేయాలని, కరీంనగర్లో బండి సంజయ్ ఎలా గెలుస్తారో చూస్తామని అన్నారు.
బీఆర్ఎస్లోకి..
హైదరాబాద్, వెలుగు : బీజేపీ నాయకురాలు, ఉమ్మడి కరీంనగర్ జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ బీఆర్ఎస్లో చేరనున్నారు. ఆమెతో ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ చర్చలు జరిపారు. దీంతో పార్టీ మారేందుకు ఉమ అంగీకరించారు. కేటీఆర్ కూడా ఉమతో ఫోన్లో మాట్లాడి పార్టీలో చేరాలని కోరారు. ఆ తర్వాత వినోద్ కుమార్, వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావు ఉమ ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఆదివారం కేటీఆర్ సమక్షంలో ఉమ బీఆర్ఎస్లో చేరుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.