మా నాన్నకు నియ్యత్ లేదు

మా నాన్నకు నియ్యత్ లేదు
  • ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బిడ్డ తుల్జా భవాని 

చేర్యాల, వెలుగు: జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి నియ్యత్ లేదు అని ఆయన బిడ్డ తుల్జాభవాని రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని పెద్ద చెరువు మత్తడి బఫర్ జోన్​లో వివాదాస్పదంగా తన పేరుపై ఉన్న స్థలంలో ఏర్పాటు చేసిన పశువుల సంతను మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప రెడ్డి, ప్రతిపక్ష పార్టీల నేతల సమక్షంలో కొబ్బరికాయ కొట్టి తుల్జా భవాని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన తండ్రి కబ్జా చేసి తన పేరిట రాసిచ్చిన భూమిని మున్సిపాలిటీకి ఇస్తానని చెప్పానని, ఇప్పుడు ఆ స్థలాన్ని ఊరికి ఇస్తూ మాట నిలబెట్టుకున్నానని అన్నారు. ఈ వివాదానికి సంబంధించి తనపై వచ్చిన కంప్లయింట్ పైనా స్పందించారు. ‘‘మా నాన్న నియ్యత్ అలాంటిది.

ఆయన ఏంటో తెల్వదా? అందరూ సంతోషంగా ఉంటూ సంత జరుగుతుంటే ఆయన చూడలేకపోతున్నారు. మత్తడి భూమి జోలికి పోవద్దని సీఎం కేసీఆర్ చెప్పినా తగ్గడం లేదు. నేను కూడా తగ్గేది లేదు. ఊరి ప్రజలు నన్ను క్షమించారు. త్వరలోనే రిజిస్ర్టేషన్ కాగితాలను అప్పగిస్తా” అని తుల్జా భవాని చెప్పారు. ఈ సందర్భంగా కొమ్మూరి ప్రతాప రెడ్డి మాట్లాడుతూ.. ‘‘మీ నాన్న మీద కేసులు పెట్టాలని మిమ్మల్ని నేనే ఉసిగొల్పుతున్నానని ఆరోపణలు చేస్తున్నరు” అని అనగా.. ‘‘మీరెవరో నాకు తెలియదు. మిమ్మల్ని నేను మొదటిసారి చూస్తున్నా” అని ఆమె అన్నారు. కన్న కూతురే కబ్జాకోరు అని విమర్శించినా.. భూమిపై మమకారంతో ప్రతిపక్ష పార్టీల నేతలపై కేసులు పెడుతున్నారని ప్రతాపరెడ్డి అన్నారు. కాగా, రెండేండ్ల తర్వాత పశువుల సంత జరగడంతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది. కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎ. మల్లారెడ్డి, ఎ. యాదయ్య, పి. ఆగంరెడ్డి, కొమ్ము నర్సింగరావు, డి. కళావతి, అందె అశోక్, ఈరి భూమయ్య, తదితరులు పాల్గొన్నారు. 

గోడ కూల్చడంపై కేసు నమోదు  

చేర్యాల పెద్ద చెరువు మత్తడి భూమిలోని కంపౌండ్ వాల్ ను తొలగించిన వారిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ సత్యనారాయణరెడ్డి తెలిపారు. తుల్జా భవాని రెడ్డి పేరిట ఉన్న భూమిలోని కంపౌండ్ వాల్ ను ఆదివారం కొందరు కూల్చివేసిన తర్వాత మరొకరికి చెందిన భూమిలోని ప్రహరీని కూడా ఇతర పార్టీల నాయకులు కూల్చేశారని, దీనిపై రాజు భాయ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. తుల్జా భవాని రెడ్డితో పాటు 15 మందిపై ఫిర్యాదు అందిందని, కొంతమంది పేర్లను గుర్తించామని తెలిపారు.