హైదరాబాద్: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. సొంత కూతురే ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకం రేపింది. తన స్థలాన్ని యాదగిరి రెడ్డి కాజేశారని ఆమె ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి భూమిని తన పేరిట మార్చుకున్నారని ఆమె ఆరోపించారు. సిద్దిపేట జిల్లా చేర్యాలలో తనకు ఎకరన్నర భూమి ఉందని ఆమె పేర్కొన్నారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆ భూమిని ముత్తిరెడ్డి తన పేరిట మార్చుకొని కబ్జా చేశారని ఆరోపించారు.
ఫిబ్రవరి 4నే కంప్లయింట్ చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె తెలిపారు. తన ఫిర్యాదు విషయం ఎంత వరకు వచ్చిందో తెలుసుకొనేందుకు ఆమె పోలీస్ స్టేషన్ రావడంతో విషయం బయటికి వచ్చింది. తుల్జా భవానీ రెడ్డి ఫిర్యాదు మేరకు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై ఉప్పల్ పోలీసులు 406, 420, 463, 464, 468, 471, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ముత్తిరెడ్డి గతంలో భూకబ్జా అరోపణలు ఎదుర్కొన్నారు.
జనగామ నడిబొడ్డున ఉన్న 9 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ధర్మవాని కుంటను చదును చేయించారు. నీటిపారుదశాఖకు చెందిన ఈ భూమిని కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ విపక్షాలు ఆందోళనకు దిగడం, అప్పటి కలెక్టర్ దేవసేన సైతం ఎమ్మెల్యే తీరును తప్పుబట్టడం వివాదాస్పదంగా మారింది. ఆ తర్వాత దానిని బతుకమ్మ పేరుతో పార్కుగా తీర్చిదిద్దారు. హనుమంతాపూర్ గ్రామాలో ఎమ్మెల్యే 60 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని, అందులో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన అసైన్డ్ భూమి సైతం ఉందంటూ మరోమారు వివాదాస్పదమైంది. దీనిపై విపక్షాలు ఆందోళనలు సైతం నిర్వహించాయి. తాజాగా ముత్తిరెడ్డిపై సొంత కూతురే ఫోర్జరీ, భూ కబ్జాపై ఫిర్యాదు చేయటం చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక ఏమైనా.. కుటుంబ కక్షలున్నాయా..? లేదా రాజకీయపరంగా భేదాభిప్రాయాలు వచ్చాయా..? అనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే ఎన్నికల సమయం కావటంతో ఈ వివాదం కాస్తా విపక్షాలకు ఓ అస్త్రంగా మారే అవకాశం ఉంది