గజ్వేల్ గురించి మాట్లాడే అర్హత హరీశ్​కు లేదు : డీసీసీ ప్రెసిడెంట్ తూంకుంట నర్సారెడ్డి

గజ్వేల్ గురించి మాట్లాడే అర్హత హరీశ్​కు లేదు : డీసీసీ ప్రెసిడెంట్ తూంకుంట నర్సారెడ్డి

గజ్వేల్, వెలుగు: గజ్వేల్ అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత హరీశ్ రావుకు లేదని, కేసీఆర్ పదేళ్లు సీఎంగా ఉన్నా ఇక్కడ అన్నీ  అసంపూర్తి పనులేనని సిద్దిపేట డీసీసీ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. మంగళవారం గజ్వేల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గజ్వేల్ పై సీఎం రేవంత్ రెడ్డి సవతి తల్లి ప్రేమ చూపుతున్నట్లు మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించడం సిగ్గుచేటన్నారు.

గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్​చేసిన పనులు ఒక్కటి కూడా పేదలకు  అక్కరకు వచ్చేవి కాదన్నారు. హరీశ్ రావు సిద్దిపేటలో ఉన్న బస్టాండ్ ను కూల్చి ఆరు నెలల్లో నిర్మాణం చేస్తే  గజ్వేల్ బస్టాండ్ నిర్మాణం నేటికీ 9 ఏళ్లయినా అందుబాటులోకి రాలేదన్నారు. పదేపదే పాండవుల చెరువును అభివృద్ధి చేశామని చెబుతున్న హరీశ్ రావు మీ కోమటి చెరువు మాదిరిగా పాండవుల చెరువును ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు.

గజ్వేల్ లో ఐదు వేల మందికి డబుల్ బెడ్ రూమ్ ఇస్తానని చెప్పి ఇప్పటికీ ఒక్కరికి కూడా ఇవ్వకుండా మోసం చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. ఇవన్నీ చూసిన తర్వాత హరీశ్ రావు గజ్వేల్ పై సవతి తల్లి ప్రేమ ఎవరు చూపారో చెప్పాలన్నారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వారికి తగిన న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు