- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం, వెలుగు : గ్రామాల్లో అవసరాల మేరకు అభివృద్ధి పనులు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. మంగళవారం రఘునాథపాలెం మండలంలోని దొనబండలో రూ.58 లక్షలతో 18 సీసీ రోడ్లకు, ఈర్లపూడిలో రూ.1.8కోట్లతో 33 సీసీ రోడ్లకు, కొర్లబోడు తండాలో రూ.16 లక్షలతో 3 సీసీ రోడ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు ఉపాధి లభించేలా గ్రామంలో ఉన్న అటవీ భూముల్లో మొక్కలు నాటించే కార్యక్రమం చేపట్టాలన్నారు.
శ్మశానవాటిక కోసం అవసరమైన భూమి తహసీల్దార్ తో సమన్వయం చేసుకొని గుర్తించాలని ఎఫ్ఆర్వోకు సూచించారు. అవసరం ఉన్నచోట విద్యుత్ పోల్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అంగన్వాడీ భవన నిర్మాణానికి ప్రతిపాదనలు అందించాలన్నారు. గ్రామంలో కమ్యూనిటీ హాల్, అందులోనే గ్రంథాలయం ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ డాక్టర్పి. శ్రీజ, జడ్పీ సీఈవో దీక్షా రైనా, ఖమ్మం ఆర్డీవో నరసింహారావు పాల్గొన్నారు.