మహబూబాబాద్, వెలుగు: ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పులపాలు చేసిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. శుక్రవారం మహబూబాబాద్జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపు కోసం సీపీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చిందన్నారు. లక్షల కోట్లతో నిర్మించిన ప్రాజెక్టులు నిరూపయోగమయ్యాయన్నారు.
ప్రకృతి వైపరీత్యాలతో ఏ ఒక్క రైతు పంటలు నష్టపోవద్దని కాంగ్రెస్ ప్రభుత్వమే పంటల బీమా ప్రీమియం చెల్లిస్తుందన్నారు. పంటల బీమా పథకాన్ని వచ్చే వానాకాలం సీజన్ నుంచే అమలు చేయబోతున్నట్టు చెప్పారు. ఇక నుంచి పంట నష్టపోయినా, దిగుబడులు తగ్గినా పంట నష్ట పరిహారం అందుతుందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ దేశంలో కులాలు , మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి కేంద్రంలో అధికారంలోకి రావడానికి బీజేపీ కుట్రలు పన్నుతోందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా సీపీఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి.అజయ్ సారథి రెడ్డి రాసిన తెలంగాణ జాతి పోరు ఆడియో, వీడియో ఆల్బమ్‌ను ఆవిష్కరించారు. ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్, సీపీఐ జిల్లా కార్యదర్శి విజయ్ సారథి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు, భాగం హేమంతరావు, సాబీర్ పాషా, తోట మల్లికార్జునరావు, నల్లు సుధాకర్ రెడ్డి, కట్టెబోయిన శ్రీనివాస్ పాల్గొన్నారు