- గడపగడపకూ తిరుగుతున్న తుమ్మల, పొంగులేటి
- మరోవైపు ప్రచారంలో దూసుకుపోతున్న ఎమ్మెల్యే కందాల
- గ్రామాలను చుట్టేస్తున్న ఎమ్మెల్యే భార్య, కూతురు
ఖమ్మం, వెలుగు : పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేదెవరో తేల్చకపోవడంతో కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు ఆగం అవుతున్నారు. మాజీ ఎంపీ, కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరూ పాలేరుపై ఆసక్తి చూపిస్తుండడంతో క్యాడర్లో కన్ఫ్యూజన్మొదలైంది. వీళ్లిద్దరిలో ఎవరికి పార్టీ హైకమాండ్ ఆశీస్సులు ఉంటాయనే విషయం తెలియట్లేదు. ఎవరికి వారే గడపగడపకూ కాంగ్రెస్పేరుతో గ్రామాలను చుట్టేస్తున్నారు. నిత్యం జనంలోనే ఉంటున్నారు.
మరోవైపు బీఆర్ఎస్ క్యాండిడేట్, ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి ప్రచారంతో హోరెత్తిస్తునారు. కాంగ్రెస్, బీజేపీ కంటే ప్రచారంలో ఒకడుగు ముందున్నారు. ఎమ్మెల్యేతోపాటు ఆయన భార్య విజయమ్మ, ఇద్దరు కూతుళ్లు గ్రామాల్లో తిరుగుతున్నారు. ఊళ్లలో ఎవరైనా చనిపోయినట్లు తెలిస్తే, వారి కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం చేస్తున్నారు. గుళ్లు, చర్చిలు, మసీదులకు విరాళాలను ఇస్తున్నారు. ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. మొత్తంగా ఎమ్మెల్యే ఫ్యామిలీ ప్రతి ఊరిని కవర్చేసే పనిలో ఉన్నారు.
ఎవరి వెనకాల వెళ్లాలో తెలియట్లే
ఇప్పటివరకు కాంగ్రెస్అభ్యర్థులను ప్రకటించకపోవడంతో క్యాడర్ఆందోళన చెందుతోంది. ఒక ఈక్వేషన్ ప్రకారం పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేస్తారని చెప్పుకుంటున్నారు. అదే సమయంలో పాలేరు నుంచి తుమ్మల, కొత్తగూడెం నుంచి పొంగులేటి చేసే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. అయితే ఇద్దరూ వివిధ కార్యక్రమాలతో పాలేరు నియోజకవర్గంలో పర్యటిస్తుండడంతో క్యాడర్కన్ఫ్యూజన్లో ఉంది. ఏండ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తలు ఏ నాయకుడి పర్యటనకు వెళ్లాలో తెలియట్లేదని చెబుతున్నారు.
ALSO READ : ఛాయ్ కప్పులపై ఫొటో, గుర్తుతో కాంగ్రెస్ ప్రచారం
పొంగులేటి తరఫున ఆయన తమ్ముడు ప్రసాద్ రెడ్డి, అల్లుడు తుంబూరు దయాకర్‌రెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తూ, సమావేశాలు నిర్వహిస్తున్నారు. పొంగులేటి కూడా ముఖ్యకార్యకర్తల సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఇక కాంగ్రెస్‌లో చేరిన తర్వాత రెండ్రోజులుగా పాలేరులో తుమ్మల పర్యటిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా తుమ్మల పాలేరుకు గోదావరి జలాలు తీసుకురావడమే లక్ష్యమని చెబుతుండడం ఆసక్తి రేపుతోంది.
పాలేరు టికెట్తనకే దక్కుతుందని తుమ్మల పూర్తి కాన్ఫిడెన్స్‌తో ఉన్నారని, పొంగులేటి మాత్రం తన వియ్యంకుడు రామసహాయం రఘురామిరెడ్డి కోసం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. రఘురామిరెడ్డి గతంలోనే పాలేరు నుంచి పోటీ చేయాలని ప్రయత్నించినా కుదర్లేదని, అందుకే ఇప్పుడు ఆసక్తి చూపిస్తున్నారన్న టాక్ నడుస్తోంది.
గోదావరి నీళ్లిచ్చి రాజకీయాల నుంచి తప్పుకుంటా : తుమ్మల
నేలకొండపల్లి : పాలేరుకు గోదావరి నీళ్లు తెచ్చిన తర్వాత రాజకీయాల నుంచి విరమించుకుంటానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. నేలకొండపల్లి మండలం సుర్దేపల్లి, మోటాపురం గ్రామాల్లో గురువారం ఆయన గడప గడపకు కాంగ్రెస్కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను జనానికి వివరించారు. అలాగే ఆత్మీ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. తానెక్కడున్నా పార్టీ అభివృద్ధితోపాటు ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తానని తెలిపారు. జనం బాధలు తెలియని వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నారని విమర్శించారు. కేవలం వాళ్ల స్వార్థం కోసమే పథకాలు ప్రారంభిస్తున్నారని ఆరోపించారు. మిగిలిన పనులు పూర్తిచేసే బాధ్యతను పాలేరు, ఖమ్మం జిల్లా ప్రజలు తనకు ఇవ్వాలని కోరారు.
ఆయన వెంట పీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు, నాయకులు సాధు రమేశ్‌రెడ్డి, గరిడేపల్లి రామారావు, కడియాల శ్రీనివాసరావు, గుడిమళ్ల మధు, నెల్లూరి భద్రయ్య, రమేశ్, జానకిరామయ్య, గూడవల్లి రామబ్రహ్మం తదితరులు ఉన్నారు. అలాగే నేలకొండపల్లి మండలంలోని బోదులబండలో గురువారం రాత్రి కాంగ్రెస్రాష్ట్ర నేత, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇంటింటికి వెళ్లి పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలను వివరించారు.