భద్రాచలం,వెలుగు : అడవిలో అన్నలు మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ గెలుపు కోసం సహకరించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. మంగళవారం భద్రాద్రికొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం గంగోలులో జరిగిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.
భద్రాచలం ఏజెన్సీ అభివృద్ధిలో బలరాం నాయక్ పాత్ర ఎంతో ఉందన్నారు. అన్నలు ఎవరి కోసం పోరాటం చేస్తున్నారో.. వారి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పనిచేస్తోందని తెలిపారు. మంచి పనిచేసే చోట మందుపాతరలు పేలవని గుర్తు చేస్తూ మావోయిస్టులు కూడా కాంగ్రెస్ గెలుపు కోసం కలిసి రావాలని కోరారు. దుమ్ముగూడెం మండలంలో పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
ఆగస్టు 15లోపు రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసి తీరుతామని చెప్పారు. ఇటీవల గాలివానకు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేలు నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ ఇచ్చిన రైతు డిక్లరేషన్, ప్రియాంక గాంధీ ఇచ్చిన యూత్ డిక్లరేషన్ రావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ రావాలన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్య, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, టీపీసీసీ సభ్యులు నల్లపు దుర్గాప్రసాద్, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
కరకట్ట పనుల పరిశీలన..
భద్రాచలం టౌన్‌లోని కూనవరం రోడ్డులో నిర్మిస్తున్న నూతన కరకట్ట పనులు వర్షాకాలం లోపు పూర్తి చేయాలని మంత్రి తుమ్మల సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. మంగళవారం కరకట్ట పనుల ప్రగతిని ఆయన పరిశీలించారు. పనులునాణ్యతగాఉండాలని సూచించారు.
మణుగూరు లో..
మణుగూరు : పార్లమెంట్ ఎన్నిక సందర్భంగా పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం మణుగూరు లోని కిన్నెర కల్యాణ మండపంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు అతివిశ్వాసాన్ని వదిలిపెట్టి ఆత్మవిశ్వాసంతో పనిచేయాలని సూచించారు.
అభివృద్ధి, సంక్షేమమే పార్టీ విధానమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దివాలా తీయించారని, అయినా సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. బలరాం నాయక్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.