మరిపెడ, వెలుగు: కార్యకర్తలు మూడు రోజులు కష్టపడి పని చేసి70 వేల మెజార్టీతో బలరాంనాయక్ను గెలిపిస్తే ఆయనతో ఐదేండ్లు పాలేరులా పని చేయించే బాధ్యత తనదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ గెలుపు కోసం బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విభజన చట్టంలోని సమస్యలు, పోడు భూముల సమస్యలు తీరాలన్న, భద్రాది రైల్వే లైన్ ముందుకు సాగాలన్న, ఎమ్మెల్యే రామచంద్రనాయక్ ఫోన్ చేస్తే ఢిల్లీలో పనులు కావాలన్నా, రాహుల్ గాంధీ ప్రభుత్వంలో మంత్రి కావాలన్నా బలరాం నాయక్ ను గెలిపించాలని కోరారు.
రైతుల కోసం సీఎంతో కొట్లాడి రైతుబంధు డబ్బులు వేయించానని, ఆగస్టు 15లోపు రూ.రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. మండల అధ్యక్షుడు పెండ్లి రఘువీరా రెడ్డి, జిల్లా లీడర్లు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి, నూకల అభినవ్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు షేక్ తాజోద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ రవి, గంగయ్య, ఐలమల్లు, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు అజ్మీర శ్రీను, మండల నాయకులు కాలం రవీందర్ రెడ్డి, పానుగోతు రాంలాల్ పాల్గొన్నారు.