- జిల్లా ప్రజల కోసమైన ఎలక్షన్ బరిలో ఉంటా
- ఖమ్మం జిల్లాలో బల ప్రదర్శన
- బీఆర్‌ఎస్ జెండా లేకుండా వెయ్యికి పైగా కార్లతో ర్యాలీ
ఖమ్మం/ఖమ్మం రూరల్, వెలుగు: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. అధికార బీఆర్ఎస్ పార్టీ టికెట్లను ప్రకటించిన తర్వాత లిస్టులో తన పేరు లేకపోవడంపై తొలిసారిగా ఆయన స్పందించారు. వారం రోజులుగా హైదరాబాద్‌లో ఉన్న ఆయన... శుక్రవారం భారీ ర్యాలీగా ఖమ్మం చేరుకున్నారు. గొల్లగూడెంలోని తన ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా తుమ్మల భావోద్వేగానికి లోనయ్యారు. తనను తప్పించామంటూ కొందరు శునకానందం పొందుతున్నారని విమర్శించారు. జిల్లా ప్రజల కోసం, వారి ఆత్మాభిమానం, ఆత్మగౌరవం కోసం ఎన్నికల బరిలో ఉంటానని ఆయన స్పష్టం చేశారు. “ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు పాదాభివందనాలు. నాకు సుదీర్ఘ రాజకీయ అవకాశాలు ఇచ్చారు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా మీరు నా వెంట ఉన్నారు. ఈ రాజకీయ అనుబంధాన్ని తెంచుకోవాలని అనుకున్నా. కానీ మీ అభిమానం చూసిన తర్వాత రాజకీయాల్లో ఉండాలనుకున్నా”అని తుమ్మల తెలిపారు.
నీళ్లు ఇయ్యకుండా వెళ్లను..
గోదావరి జలాలతో జిల్లా ప్రజల పాదాలు కడిగిన తర్వాతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని తుమ్మల వెల్లడించారు. పాలేరు, వైరా, లంకా సాగర్, బేతుపల్లి ప్రాజెక్ట్‌లతో పాటు ఉభయ జిల్లాల్లోని అన్ని రిజర్వాయర్లకు నీళ్లు నింపి మీ వద్ద సెలవు తీసుకుంటానని చెప్పారు. అలంకారం, అధికారం, అహంకారం, అనుభవం కోసం తనకు పదవి అవసరం లేదన్నారు. కార్యకర్తల అభిమానం, సపోర్ట్ వల్లే ఇంకా రాజకీయాల్లో ఉన్నానని, ఎక్కడా మీరు తలవంచే పని చేయనని, ఒకవేళ ఆ పని చేస్తే తల తెంచుకుంటానన్నారు. తన రాజకీయ భవిష్యత్ మీ చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు.
భారీ ర్యాలీ
హైదరాబాద్ నుంచి తుమ్మల వస్తున్నారని తెలిసి, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అభిమానులు శుక్రవారం మామిళ్లగూడెం టోల్‌గేట్ వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి వెయ్యికి పైగా కార్లు, బైక్‌లతో ఖమ్మం గొల్లగూడెంలోని ఇంటి వరకు ర్యాలీగా వెళ్లారు. ఈ ర్యాలీలో ఎక్కడా బీఆర్ఎస్ జెండాలు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కాన్వాయ్ నాయకన్ గూడెం నుంచి ఖమ్మం చేరుకునే వరకు జై తుమ్మల నినాదాలతో మార్మోగింది. దారిపొడవునా తుమ్మల ప్రజలకు అభివాదం చేశారు. కూసుమంచి, తల్లంపాడు, మద్దులపల్లి గ్రామాల్లో మహిళలు హారతులు పట్టి తుమ్మలకు స్వాగతం పలికారు. పొలిటికల్‌గా తుమ్మల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి నెలకొంది.