- మంత్రులు కోమటిరెడ్డి, పొంగులేటి, తుమ్మల
- ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం
ఖమ్మం, వెలుగు: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు చేయడానికి ‘ప్రజా పాలన’ కార్యక్రమం చేపడుతున్నట్టు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. మంగళవారం కొత్త కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాల అధికారులతో మంత్రులు ప్రజా పాలన సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం బాధ్యతలు తీసుకున్న రెండ్రోజుల్లోనే ఎన్నికల హామీలను అమలు చేసిన చరిత్ర ఎక్కడా లేదన్నారు. ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీలను రెండ్రోజుల్లోనే అమలు చేశామన్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. గత పాలకులు పదేండ్లలో రాష్ట్రంలో పేదవారికి ఇల్లు, రేషన్, ఆరోగ్యశ్రీ కార్డులు, ఉద్యోగాలు ఇవ్వలేకపోయారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తే అది 400 ఎకరాల్లో ఉన్న కేసీఆర్ ఫామ్ హౌస్ కు తప్పించి ఎవరికీ ఉపయోగపడలేదన్నారు.
కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులను కేసీఆర్ కావాలనే పూర్తి చేయలేదని చెప్పారు. నాగార్జున సాగర్ డ్యామ్ కట్టి 75 ఏండ్లు పూర్తయినా ఇంకా చెక్కు చెదరలేదని, కానీ మేడిగడ్డ మాత్రం మూడేళ్లకే కుంగిపోయిందన్నారు. మేడిగడ్డ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజా పాలనలో గ్రామ సభలు చేపట్టి అప్లికేషన్లు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 100 రోజులలోపే హామీలన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు.
ప్రతి పల్లెలో సభ..
జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ లోని ప్రతీ వార్డులో సభ నిర్వహించి దరఖాస్తులు స్వీకరించాలని మంత్రి పొంగులేటి ఆఫీసర్లకు సూచించారు. ప్రజలకు చేరువగా పాలన అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. గ్రామ సభల షెడ్యూల్ ముందస్తుగా తెలియజేయాలని, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి 100 మందికి ఒక కౌంటర్, షామియానా, తాగునీటి వసతి
కల్పించాలన్నారు.
సమష్టిగా కృషి చేయాలి
అధికారులు సమష్టిగా కృషి చేసి ‘ప్రజాపాలన’ను సక్సెస్ చేయాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ప్రియాంక అల కోరారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు షిఫ్టుల్లో ప్రజా పాలన సభలు నిర్వహిస్తామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 22 మండలాల్లో 481 గ్రామ పంచాయతీలు, 4 మున్సిపాలిటీల్లో 114 వార్డులు ఉన్నట్లు తెలిపారు. జనాభాకు అనుగుణంగా టీమ్లు ఏర్పాటు చేసి ప్రోగ్రామ్ను సక్సెస్ చేస్తామన్నారు.
సభలకు గట్టి బందోబస్తు
ప్రజా పాలన సభలకు గట్టి బందోబస్తు చేపట్టనున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. సభలలో క్యూల నిర్వహణలో వయోవృద్దులు, దివ్యాంగులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
అన్ని కుటుంబాలను కవర్ చేస్తాం..
ఖమ్మం జిల్లాలో 21 మండలాల్లో 589 గ్రామ పంచాయతీలు, 4 మున్సిపాలిటీల్లో 125 వార్డులు ఉన్నట్లు ఉన్నాయని, 59 బృందాలు ఏర్పాటు చేసి అన్ని కుటుంబాలను కవర్ చేస్తామని ఖమ్మం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యేలు మట్టా రాగమయి దయానంద్, తెల్లం వెంకట్రావు, ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమలరాజ్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, భద్రాచలం ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ సింగ్, భద్రాద్రి కొత్తగూడెం అదనపు కలెక్టర్లు డాక్టర్ రాంబాబు, మధుసూదన్ రాజు, ఉమ్మడి జిల్లా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సీతారామ ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసేందుకు కృషి
సీతారామ ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసేందుకు ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులం కలిసి కృషి చేస్తున్నామని తుమ్మల నాగేశ్వరావు తెలిపారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి త్వరలోనే ప్రాజెక్టును పరిశీలిస్తామని చెప్పారు. సీతారామ ద్వారా పాలేరు నుంచి గోదావరి జలాలను నల్గొండ జిల్లాకు కూడా తరలించేలా ఏర్పాట్లు ఉన్నాయన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రస్తుతం పురోగతిలో ఉన్న అన్ని జాతీయ రహదారులు పూర్తి చేసేందుకు ఆర్అండ్ బీ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకరించాలని కోరారు.
సూర్యాపేట నుంచి రాజమండ్రి, కోదాడ నుంచి కొరివి, కొత్తగూడెం నుంచి వలిగొండ పనులు జరుగుతున్నాయని, జగ్గయ్యపేట నుంచి తల్లాడ మీదుగా కొత్తగూడెం జాతీయ రహదారి కోసం ప్రయత్నించాల్సిన అవసరం ఉందన్నారు. భద్రాచలానికి అన్ని వైపులా నుంచి జాతీయ రహదారులు కలిసేలా ప్రణాళికలు చేశామని చెప్పారు.