సీతారామ ప్రాజెక్టు ద్వారా ఆగస్టు 15కల్లా కనీసం లక్షన్నర ఎకరాలకు గోదావరి జలాలు అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. సోమవారం ఖమ్మం సరిహద్దుకు సమీపంలో ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం దగ్గరున్న గుబ్బల మంగమ్మ ఆలయాన్ని తుమ్మల దర్శించుకొని మీడియాతో మాట్లాడారు. ఇటీవల శంకుస్థాపన చేసిన వైరా లింక్ కెనాల్‌కు అవసరమైన భూసేకరణపై చర్యలు తీసుకుంటున్నామని, 3 నెలల్లోగా పనులు కంప్లీట్ చేసి నీళ్లిచ్చేలా ప్లాన్ చేస్తున్నామన్నారు. సాగర్ ఆయకట్టు స్థిరీకరణ, వైరా రిజర్వాయర్ ఆయకట్టు, లంకాసాగర్ ఆయకట్టుతో పాటు 8 చిన్న లిఫ్ట్ ల కింద భూములకు ముందుగా నీరందిస్తామన్నారు.
సాగర్ జలాల విడుదలపై సీఎస్‌కు ఫోన్
ఖమ్మం జిల్లాకు తాగునీటి కోసం సాగర్ జలాలు వెంటనే విడుదల చేయాలని సీఎస్ శాంతికుమారిని మంత్రి తుమ్మల కోరారు. పాలేరు రిజర్వాయర్‌లో ఒకట్రెండు రోజులకు సరిపడా మాత్రమే తాగు నీరు ఉన్నాయని, వెంటనే విడుదల చేసినా నీళ్లు పాలేరుకు చేరుకోవడానికి రెండ్రోజుల కంటే ఎక్కువ సమయం పడుతుందని చెప్పారు. కేవలం తాగునీటి కోసమే నీళ్లివ్వాలని, కాలువల్లో రైతులు వ్యవసాయ మోటార్లు వేయకుండా, తూముల ద్వారా నీటిని తీసుకెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆఫీసర్లకు ఆదేశాలిచ్చినట్టు ఆయన తెలిపారు.