- త్వరలోనే సర్కార్ ప్రీమియంతో పంటల బీమా పథకం: మంత్రి తుమ్మల
- సీఎంకు, మా మంత్రులకు సొంత అభిప్రాయాల్లేవు
- రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
- కరీంనగర్లో రైతు భరోసా అమలుపై రైతుల నుంచి అభిప్రాయాల సేకరణ
- హాజరైన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్
కరీంనగర్, వెలుగు : రాష్ట్రంలోని రైతులందరి సూచనలు, అభిప్రాయాలను క్రోడీకరించి మెజార్టీ రైతుల అభీష్టం మేరకే రైతు భరోసా భూపరిమితిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. వాతావరణ కారణాలతో పంట నష్టపోతున్న రైతులకు భరోసా ఇచ్చేందుకు త్వరలోనే సర్కార్ ప్రీమియంతో పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు.
కరీంనగర్ బైపాస్ రోడ్ లోని ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం రైతు భరోసా పథకంపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన రైతుల అభిప్రాయ సేకరణ కార్యక్రమానికి జిల్లా ఇన్ చార్జి మంత్రి, రాష్ట్ర నీటిపారుదల , పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ, ఐఅండ్ పీఆర్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు రైతులు ఐదు నుంచి పదెకరాల్లోపు మాత్రమే రైతు భరోసా అమలు చేయాలని సబ్ కమిటీ కి సూచించారు.
రైతుల సూచనలు, అభిప్రాయాల మేరకే...
మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ రైతుల సూచనలు, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని రైతు భరోసాను పకడ్బందీగా అమలు చేస్తామని చెప్పారు. పంటల బీమా పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామని, ఇన్స్యూరెన్స్ కంపెనీల కోసం ఇప్పటికే టెండర్లు పిలిచామని వెల్లడించారు. పంట నష్టపోయిన రైతులను పంటల బీమా ద్వారా సాయం అందించి ఆర్థికంగా ఆదుకుంటామన్నారు. కరీంనగర్ జిల్లాలో రైతులు ఆయిల్ పాం సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత పాలకులు నాలుగు గోడల మధ్య కూర్చుని విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వారని గుర్తు చేశారు. రైతు భరోసా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు సొంత అభిప్రాయాలు లేవని రైతుల అభిప్రాయాల మేరకే స్కీమ్‌లో మార్పులు చేస్తామని తెలిపారు.
ఐటీ దాఖలు చేసే రైతులకు కూడా రుణమాఫీ కాదని గత సర్కార్ పెద్దలు ప్రచారం చేశారని, కానీ అలాంటిదేమీ జరగలేదన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఆరు నూరైనా రుణమాఫీ అమలు అమలు చేస్తామని చెప్పామని, అది నెరవేరుస్తున్నామన్నారు. రాష్ట్ర ఖజానాలో ఎంత ఇబ్బంది ఉన్నా వరంగల్ సభలో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం రెండు లక్షల రుణ మాఫీ చేసిందన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు సోనియా, రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను తమ ప్రభుత్వం నిలబెట్టుకుందని, అందులో భాగంగానే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు.
జిల్లా ఇన్ చార్జీ మంత్రిగా కరీంనగర్ జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక దృష్టిసారిస్తానని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజా పాలనలో ప్రజల అభిప్రాయాల మేరకే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. రైతులు, రైతు సంఘాల నాయకులు, మేధావులు, రాజకీయ పార్టీల నాయకులు అందరి సూచనలు తీసుకొని రైతు భరోసాను అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ రైతు భరోసా పరిమితిని ఐదెకరాలకు కుదిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. రైతుకు ఎంత భూమి ఉన్నా కేంద్రం ఇచ్చేది రూ.6 వేలు మాత్రమేనని, ఎకరాకు రూ.15 వేల చొప్పున 5 ఎకరాలకు ఏటా రూ.75 వేలు ఇవ్వొచ్చని తెలిపారు.
ఐదు నుంచి పదెకరాల్లోపు అమలు చేయండి..
రైతు భరోసా స్కీమ్ ను ఐదు నుంచి పది ఎకరాల వరకు సాగు చేసే రైతులకు అమలు చేయాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రైతులు కోరారు. రైతులు మాట్లాడుతూ బడా వ్యవసాయదారులకు రైతు భరోసా అందించవద్దని, సన్న చిన్న కారు రైతులకే ఇవ్వాలన్నారు. వ్యవసాయం చేసే భూములకే అందించాలని, నిరుపయోగంగా ఉన్న భూములకు చెల్లించవద్దని విజ్ఞప్తి చేశారు. రైతులకు సబ్సిడీపై పనిముట్లు అందించి ఆదుకోవాలని కోరారు. కొందరు ఐదెకరాల్లోపు వారికే అమలు చేయాలని సూచించగా..మరి కొందరు పదెకరాల వరకు పరిమితి పెట్టాలని సూచించారు.
వర్క్ షాప్ నకు వచ్చిన రైతులకు అగ్రికల్చర్ ఆఫీసర్లు సర్వే ఫామ్స్ ఇచ్చి అభిప్రాయాలను రాతపూర్వకంగా తీసుకున్నారు. ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ప్రభుత్వ సలహాదారు హర్కర్ వేణుగోపాల్, మానకొండూర్, పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, చింతకుంట విజయ రమణారావు, మక్కాన్ సింగ్ ఠాకూర్, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లు పమేలా సత్పతి, సందీప్ కుమార్ జా, సత్య ప్రసాద్, కోయ శ్రీహర్ష, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, కరీంనగర్ జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.