డిసెంబర్ 7న మెడికల్ కాలేజ్ కు శంఖుస్థాపన : తుమ్మల నాగేశ్వరరావు

  • హాజరు కానున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

ఖమ్మం టౌన్, వెలుగు :   ఖమ్మం మెడికల్ కాలేజీకి కొత్త భవనాల నిర్మాణానికి ఈనెల 7న శంకుస్థాపన చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.  వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ  హాజరవుతారని చెప్పారు. సోమవారం మెడికల్ కాలేజీకి కేటాయించిన 40 ఎకరాల స్థలాన్ని   కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి ఆయన పరిశీలించారు. తర్వాత  మీడియా తో  మాట్లాడారు. ప్రజా పాలన వారోత్సవాల్లో భాగంగా మెడికల్ కాలేజీకి శంఖుస్థాపన కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. 40 ఎకరాల్లో 4 లక్షల స్క్వేర్ ఫీట్లతో, రూ.166 కోట్లతో మెడికల్ కాలేజ్ బిల్డింగ్ ను విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దుతామన్నారు. వచ్చే ఏడాది జూన్ లో కొత్త బిల్డింగుల్లో క్లాస్ లు ప్రారంభించేందుకు ప్లాన్ చేసినట్లు పేర్కొన్నారు.

 ప్రస్తుతం కాలేజ్ లో 100 సీట్లకు అడ్మిషన్ లు ఇచ్చారని, మరో 50 సీట్లు పెంచాలని హెల్త్ మినిష్టర్ దృష్టికి తీసుకెళ్లగా పరిశీలనలో ఉన్నట్లు మంత్రి చెప్పారు. రఘునాథ మండల కేంద్రంలోనే స్వామి నారాయణ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాలకు స్థలం కేటాయింపు జరగడం సంతోషకరమన్నారు.  ఆయిల్ పామ్ గెలలకు రూ.20,413 ధర రావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అంతకు ముందు రఘునాథపాలెం మండలంలో శివాయి గూడెం, పువ్వాడ నగర్, మంచుకొండలో సీసీ రోడ్డు, డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 

 రఘునాథ పాలెం మండలంలో ఉన్న చెరువులు త్వరగా నింపేందుకు సాగర్ నీళ్లను అత్యవసరంగా తీసుకొనివచ్చేందుకు రూ.66 కోట్లతో మంచుకొండ ఎత్తిపోతల పథకం  శ్రీకారం చుట్టామన్నారు. దీని వల్ల 36 చెరువులు నింపేటట్లు రూపకల్పన చేశామన్నారు.  కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీజ, జడ్పీ సీఈఓ దీక్ష రైనా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కళావతి బాయి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, సాదు రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు