ఈ దేశానికి ఉన్న అస్తి యువత అన్నారు ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు. ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామిగా ఉందంటే కారణం యువతే అన్నారు. ఏ దేశంలో అయినా మంచి డాక్టర్స్, ఇంజినీర్స్, సాప్ట్ వేర్ ఉద్యోగులు ఉన్నారంటే మన యువ శక్తే కారణమని చెప్పారు. అల్లూరి సీతారామరాజు, స్వామి వివేకానంద పుట్టిన దేశం మనదన్నారు. తెలంగాణ భవిష్యత్తే కాకుండా..దేశం భవిష్యత్తు మార్చే శక్తి యువతకు ఉందని చెప్పారు. భారత్ జోడో యాత్రతో యువతకు రాహుల్ గాంధీ స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. ఖమ్మం పట్టణంలోని ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు కూరపాటి ప్రదీప్ యువం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తుమ్మల మాట్లాడారు.
తెలంగాణ యువతకు గత పదేళ్లలో అన్యాయం జరిగిందన్నారు తుమ్మల. యువత నోట్లో మన్ను కొట్టారని, ఆ మన్ను మీరు ఎన్నికల్లో కొట్టాలన్నారు. తెలంగాణ కల సాకారం చేసిన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. కొండలు పిండి చేసే శక్తి యువతకు ఉందన్నారు. ఎన్నికల్లో ఓడించేందుకు బీఆర్ఎస్ ఓ లేక్కా అని కామెంట్స్ చేశారు.
భగత్ సింగ్ పోరాట స్పూర్తితో ఖమ్మంలో వేలాదిగా యువత కదం తొక్కారని చెప్పారు. ఖమ్మంలో అరాచక శక్తులు సంగతి యువ శక్తి తేల్చాలని చెప్పారు. ఖమ్మంలో అక్రమంగా పోలీసు కేసులు పెట్టినోళ్ల సంగతి చూద్దామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం ఖమ్మంలో యువత కదం తొక్కాలన్నారు.