అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అక్రమ కేసులన్నీ కొట్టేయిస్తాం: తుమ్మల

ఖమ్మం టౌన్, వెలుగు : డిసెంబర్ 3న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏ పోలీస్ అధికారులైతే అక్రమ కేసులు పెట్టారో..వారిని బాధితుల ఇంటికి పిలిపించి దండం పెట్టించి మరీ క్షమాపణ చెప్పిస్తామని, రాష్ట్రంలో పెట్టిన​అక్రమ కేసులన్నీ కొట్టేయిస్తామని మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ నేత తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం నియోజకవర్గ పరిధిలోని వైఎస్సార్ నగర్ లో కార్పొరేటర్ లకావత్ సైదులు ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న తుమ్మల మాట్లాడారు. 

గతంలో ప్రచారానికి వెళ్తే ప్రజలు మంచినీళ్ల సౌకర్యం కల్పించాలని, చెక్ డ్యాంలు నిర్మించాలని, రోడ్లు వేయండని ఆడిగేవారని, కానీ, పది రోజులుగా ఎక్కడికి వెళ్లినా తమపై కేసులు ఉన్నాయని, వాటిని కొట్టివేయించాలని అడుగుతున్నారన్నారు. అక్రమ కేసుల గురించి సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో చెప్పి ఓకే కలం పోటుతో రాష్ట్రం మొత్తం కొట్టేయిస్తామని చెప్పారు. 

అక్రమ కేసులు పెట్టిన పోలీస్ అధికారులను వెంటనే బదిలీ చేయమని, వారిని జీపు ఎదుట నియోజకవర్గమంతా ఉరికించిన తర్వాతనే బదిలీ చేస్తామన్నారు. వాళ్లకు డిసెంబర్ 3 వరకు గడువు ఇస్తున్నామని, ఈలోపు బుద్ధిగా మసలుకోవాలన్నారు. అధికారులంతా ఒళ్లు దగ్గర పెట్టుకోవాలన్నారు. కొందరు పోలీస్ అధికారుల పనితీరుపై కమిషనర్, ఐజీ, డీజీలతో మాట్లాడానని, అయినా వాళ్లలో మార్పు రాకపోతే వాళ్ల కర్మ అని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.