- తన ఇండ్లల్లో ఎన్నికల అధికారుల సోదాలపై తుమ్మల ఫైర్
ఖమ్మం రూరల్, వెలుగు : మాజీ మంత్రి, ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఇండ్లల్లో బుధవారం ఎన్నికల అధికారులు, పోలీసులు సోదాలు జరిపారు. ఖమ్మం రూరల్ మండలం శ్రీసిటీ, అర్బన్‌లోని గొల్లగూడెంలో గల తుమ్మల నివాసాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సీ విజిల్ యాప్ లో అందిన ఫిర్యాదు మేరకే తనిఖీలు చేశామని వారు చెప్తున్నారు. సోదాలపై తుమ్మల స్పందిస్తూ.. పువ్వాడ అజయ్ ఓటమి ఇప్పటికే ఖరారైందని, ఆ ఫ్రస్టేషన్లోనే చివరి ప్రయత్నంగా అధికారులను ఉపయోగించుకున్నాడని ఆరోపించారు.
ప్రత్యర్థి పార్టీలపై కక్షపూరితంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కేసీఆర్ లాంటోడే తన ముందు బచ్చా అని.. ఇక మంత్రి పువ్వాడ అజయ్ స్థాయి ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఎన్ని చిల్లర పనులు చేసినా, తన కార్యకర్త కూడా బెదరడని అన్నారు. పువ్వాడ మంత్రి అయిన తర్వాత ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందో ప్రజలు మర్చిపోయారన్నారు. తనపైకి పోలీసులను పంపిన మరకను చెరిపేసుకునేందుకు అజయ్ తన ఇంట్లోనూ సోదాలు చేయించుకున్నారని తుమ్మల ఆరోపించారు.