కాంగ్రెస్​లోకి తుమ్మల, వీరేశం.. సోనియా సభలో భారీ చేరికలు!

రేపు కాంగ్రెస్​లోకి తుమ్మల, వీరేశం, జిట్టా, యెన్నం?
తుమ్మలతో రేవంత్​, భట్టి, పొంగులేటి భేటీ.. చేరికపై చర్చ

హైదరాబాద్​, వెలుగు : సోనియా గాంధీ హాజరుకానున్న విజయభేరి సభలో పలువురు ముఖ్య నేతలు కాంగ్రెస్​ పార్టీలో చేరనున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే తుమ్మల నాగేశ్వర్​రావుతో కాంగ్రెస్​నేతలు పలు మార్లు చర్చలు జరిపారు. కాంగ్రెస్​ పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. శుక్రవారం కూడా పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్​ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, జానారెడ్డి కుమారుడు రఘువీర్​ రెడ్డి, రోహిన్​ రెడ్డి ఆయనతో భేటీ అయ్యారు. తుమ్మల నివాసంలో దాదాపు గంటపాటు సాగిన ఈ సమావేశంలో ఆయన్ను కాంగ్రెస్​ పార్టీలోకి రావాల్సిందిగా వాళ్లు కోరినట్టు సమాచారం. సోనియా గాంధీ సభ నేపథ్యంలో పార్టీలో చేరితే బాగుంటుందని చెప్పినట్టు తెలిసింది. 

తుమ్మల పోటీపై చర్చ

కాంగ్రెస్​లో చేరే విషయంలో తుమ్మల నాగేశ్వర్​ రావు కొంతకాలంగా డైలమాలో ఉన్నారు. అనుచరులు, కార్యకర్తలతో ఎన్నో మీటింగులను పెట్టారు. ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్​ ముఖ్య నేతలూ పలుమార్లు ఆయనతో చర్చలు జరిపారు. రేవంత్​, భట్టి, పొంగులేటి, రేణుకా చౌదరి తదితర నేతలు ఆయన్ను కన్వీన్స్​ చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే టికెట్​ హామీ గురించి తుమ్మల స్పష్టత కోరుతున్నట్టు పార్టీ వర్గాలంటున్నాయి. పాలేరు సీటును తుమ్మల ఎక్స్​పెక్ట్​ చేస్తున్నారు. కాంగ్రెస్​ పెద్దలు మాత్రం ఖమ్మం నుంచి బరిలోకి దిగాల్సిందిగా ఆయన్ను ఒప్పించేందుకు ప్రయత్నించినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇటు తుమ్మల చేరిక విషయంపై డీకే శివకుమార్​తోనూ పార్టీ నేతలు చర్చించినట్టు తెలిసింది. శనివారం మంచి రోజు ఉన్నందున తొలుత పార్టీ కండువా కప్పుకుని.. ఆదివారం తుక్కుగూడలో జరిగే సోనియా సభలో అధికారికంగా పార్టీలో తుమ్మల చేరే అవకాశాలున్నాయని కాంగ్రెస్​ వర్గాలు చెప్తున్నాయి. 

ALSO READ: ధాన్యం టెండర్లకు బిడ్డింగ్‌‌ పూర్తి 

మరికొందరు నేతలు కూడా..

సోనియా గాంధీ సభలోనే మరికొందరు నేతలు కూడా కాంగ్రెస్​ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. బీఆర్​ఎస్​ టికెట్​ వస్తుందని ఆశించి భంగపడ్డ నకిరేకల్​ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్​ కండువా కప్పుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆయనతోనూ కాంగ్రెస్​ నేతలు చర్చించి టికెట్​ హామీని ఇచ్చినట్టు తెలుస్తున్నది. ఇక, ఇటీవల రేవంత్​తో భేటీ అయిన జిట్టా బాలకృష్ణా రెడ్డి, యెన్నం శ్రీనివాస్​ రెడ్డి కూడా సోనియా సభలోనే కాంగ్రెస్​లో చేరుతారన్న టాక్​ వినిపిస్తున్నది. వేముల వీరేశం నకిరేకల్​ టికెట్​ను ఆశిస్తున్నారు. జిట్టా బాలకృష్ణారెడ్డి భువనగిరి టికెట్​, యెన్నం శ్రీనివాస్​రెడ్డి మహబూబ్​నగర్​ టికెట్​ను ఆశిస్తున్నారు. అయితే, వారికి టికెట్​ హామీనిచ్చినా.. ఏ నియోజకవర్గం నుంచి అన్నది మాత్రం వారికి పార్టీ నేతలు హామీ ఇవ్వలేదని తెలుస్తున్నది.