ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం నగరం నడిబోడ్డున ఉన్న ఖిల్లాను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు డీపీఆర్ రూపొందించి నివేదిక సమర్పించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహాకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. బుధవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆర్కియాలజీ, పర్యాటక శాఖ అధికారులతో ఖమ్మం ఫోర్టు అభివృద్ధి పనులపై సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఖిల్లాలో రోప్‌వే, తాగునీరు, టాయిలెట్స్, పార్కింగ్, ఫుడ్‌కోర్టు, మెట్ల రైలింగ్, లైటింగ్, గజిబోస్, సీటింగ్ బేంచీలు, విద్యుత్ సరఫరా కోట ప్రాంత పరిరక్షణతో కూడిన ఇతర పర్యాటక సదుపాయాల కల్పనకు నిపుణులతో చర్చించి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. సమావేశంలో ఆర్కియాలజీ, మ్యూజియం శాఖ డిప్యూటీ డైరెక్టర్ నారాయణ, తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇంజినీర్లు రామకృష్ణ, శ్రీధర్, జిల్లా పర్యాటక శాఖ అధికారి సుమన్ చక్రవర్తి , స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కార్యకర్తకు కృతజ్ఞతలు
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని ప్రలోభాలు చూపిన లొంగకుండా తన గెలుపునకు కృషి చేసిన కార్యకర్తలకు మంత్రి తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలోని చింతగుర్తి గ్రామంలో మాజీ సర్పంచ్ తమ్మిని నాగేశ్వరరావు అధ్యక్షతన కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మండల అభివృద్ధి తో పాటు ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. త్వరలో గ్రామ, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అనంతరం తుమ్మలను సన్మానించారు. ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో కేపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ జెర్సీలను మంత్రి ఆవిష్కరించారు. దంసలా పురం వద్ద ఉన్న సమ్మక్క, సారక్క గద్దెల వద్ద చేసిన ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.