పెండింగ్ ప్రాజెక్టులు, రోడ్లు పూర్తి చేస్తాం : తుమ్మల నాగేశ్వరరావు

  • గత సర్కారు కాల్వలు కూడా పట్టించుకోలే 
  • సంక్షేమం, అభివృద్ధిని జోడెడ్లలా ముందుకు తీసుకెళ్తాం

నల్గొండ, వెలుగు:  జిల్లాలో పెండింగ్‌‌‌‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని అగ్రికల్చర్, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖ, ఉమ్మడి జిల్లా ఇన్‌‌‌‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు.  మంగళవారం నల్గొండలో ఇరిగేషన్, సివిల్‌‌‌‌ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్  కుమార్ రెడ్డి, ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌బీ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.

 గత ప్రభుత్వం పదేళ్లలో కొత్తగా ఒక్క కాలువను కూడా తవ్వకుండా.. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పట్టించుకోకుండా కొత్త ప్రాజెక్టుల పేరిట లక్షల కోట్లు దోచుకుందని ఆరోపించారు.  ఆసియాలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ టన్నెల్ అయిన ఎస్ఎల్బీసీని నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ఎస్‌‌‌‌ఎల్బీసీ టన్నెల్‌‌‌‌తో పాటు ఖమ్మంలోని సీతారామ, ఇతర ప్రాజెక్టులన్నీ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ ఆధ్వర్యంలో కంప్లీట్ చేస్తామన్నారు.  

 మంత్రి కోమటిరెడ్డికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరితో మంచి సాన్నిహిత్యం ఉందని, ఆయన నాయకత్వంలో రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు. వివిధ ప్రాంతాలను కలుపుతూ రోడ్లను నిర్మించడంతో పాటు టూరిజాన్ని కూడా డెవలప్ చేస్తామని చెప్పారు.  అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో  సంక్షేమం అభివృద్ధిని జోడెడ్లలా ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. 

రైస్ మాఫియాను అరికడతాం: మంత్రి ఉత్తమ్

ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..  గత ప్రభుత్వంలో రేషన్ విషయంలో వేలకోట్ల దోపిడీ జరిగిందని, రైస్ మాఫియాలో బీఆర్‌‌ఎస్‌ లీడర్లందరికీ వాటా ఉందని ఆరోపించారు. కిలోకు 39 రూపాయలు వెచ్చించి రేషన్ షాపుల ద్వారా ప్రజలకు బియ్యం అందిస్తున్నామని, అది మిల్లులు,  పౌల్ట్రీలకు వెళ్తోందని మండిపడ్డారు.  

సివిల్ సప్లై శాఖ పనితీరును మెరుగు పరుస్తామని, రేషన్ ప్రొక్యూర్మెంట్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్  చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రేషన్ సరఫరా విషయంలో వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని, నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని అన్నారు. పెండింగ్‌ ప్రాజెక్టులు కచ్చితంగా పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు.

బీఆర్ఎస్ దోపిడీ పత్రాన్ని రిలీజ్ చేస్తాం: మంత్రి కోమటిరెడ్డి

ఆర్అండ్‌‌‌‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ..  బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌‌‌‌‌‌‌ స్వేద పత్రం విడుదల చేయడం కాదు.. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ దోపిడీ పత్రాన్ని తామే రిలీజ్ చేస్తామని హెచ్చరించారు. పదేళ్లలో నల్గొండ జిల్లాలోని ఎస్ఎల్బీసీ సొరంగం, ఏఎమ్ఆర్బీ కెనాల్, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులేవీ పూర్తి చేయలదేని మండిపడ్డారు. 

అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే  రెండు గ్యారంటీలు అమలు చేశామని, మిగితా నాలుగు గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. ఈ  సమావేశంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఎమ్మెల్యేలు వేముల వీరేశం, మందుల సామ్యూల్, పద్మావతి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జయవీర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, తదితరులున్నారు. 

ప్రజా పాలనకు పక్కా ఏర్పాట్లు చేయండి

ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహించనున్న ప్రజా పాలనకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఉమ్మడి జిల్లా ఇన్‌‌‌‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.  మంగళవారం నల్గొండ పట్టణంలోని ఎంఎన్ఆర్​ కన్వెన్షన్ హాల్‌‌‌‌లో ఇరిగేషన్, సివిల్‌‌‌‌ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్  కుమార్ రెడ్డి, ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌బీ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, అధికారులతో ప్రజాపాలనపై సన్నాహక సమావేశం నిర్వహించారు.  

ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రత్యేక కౌంటర్లతో పాటు హెల్ప్ డెస్క్‌‌‌‌ ఏర్పాటు చేయాలని సూచించారు. రద్దీ ఎక్కువ ఉన్నచోట టీమ్‌‌‌‌ను పెంచి ప్రజల నుంచి పక్కగా అప్లికేషన్లు తీసుకోవాలన్నారు. మంత్రి ఉత్తమ్‌‌‌‌ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా పాలనలో స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగా ఆరు గ్యారెంటీలు అమలు అవుతాయని, కుటుంబం యూనిట్‌‌‌‌గా రేషన్ కార్డు ప్రామాణికంగా అప్లై చేసుకోవాలన్నారు. 

పెద్ద జీపీలు, మున్సిపల్ వార్డుల్లో ఎక్కువ కౌంటర్లు, క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు.  మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజాపాలనలో తాగునీటి సౌకర్యం,  టెంట్లు, కుర్చీలు, వసతులు ఏర్పాటు చేయాలని, అలాగే ఆరోగ్య సిబ్బంది  అందుబాటులో ఉండాలన్నారు. గిరిజన పంచాయతీల్లో ఒక్క లబ్ధిదారుడు కూడా మిస్‌‌‌‌ కావొద్దని, ఈ విషయంలో స్థానిక నేతలు, అధికారులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. 

151 టీములు నియమించాం

ఇన్‌‌‌‌చార్జి కలెక్టర్  హేమంత్ కేశవ్  పాటిల్ మాట్లాడుతూ జిల్లాలోని 844  జీపీల్లో 112 టీమ్స్, 8 మున్సిపాలిటీల్లోని  182 వార్డులలో 39 టీమ్స్ నియమించామని తెలిపారు.  సూర్యాపేట అడిషనల్‌‌‌‌ కలెక్టర్ సీహెచ్‌‌‌‌ ప్రియాంక మాట్లాడుతూ..  జిల్లాలోని 475 జీపీల్లో 46 టీమ్స్, 5 మున్సిపాలిటీల్లోని 141 వార్డులలో 12 టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు. యాద్రాద్రి  భువనగిరి కలెక్టర్ హనుమంతు  జెండగే  మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో 14, జీపీల్లో 37 టీమ్‌‌‌‌లతో పాటు  1961 కౌంటర్లను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలతో పాటు నల్గొండ ఎస్పీ అపూర్వ రావు, యాదాద్రి భువనగిరి డీసీపీ రాజేశ్ చంద్ర, సూర్యాపేట ఏఎస్పీ నాగేశ్వర రావు, అడిషన్ కలెక్టర్లు పాల్గొన్నారు.