ఖర్గే సమక్షంలో తుమ్మల, కోమటి రెడ్డి ఆధ్వర్యంలో జిట్టా చేరిక

హైదరాబాద్, వెలుగు: బీఆర్‌‌‌‌ఎస్ లీడర్‌‌, మాజీ మంత్రి‌‌ తుమ్మల నాగేశ్వర్‌‌‌‌ రావు కాంగ్రెస్‌‌లో చేరారు. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం హైదరాబాద్‌‌కు వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తుమ్మలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆదివారం జరిగే విజయభేరి సభలో తుమ్మల చేరాల్సి ఉన్నా.. ఒకరోజు ముందుగానే ఆయన కాంగ్రెస్‌‌ కండువా కప్పుకున్నారు. అంతకుముందు, బీఆర్‌‌‌‌ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ సీఎం కేసీఆర్‌‌‌‌కు తుమ్మల లేఖ రాశారు. ఇన్నాళ్లు తనకు సహకరించినందుకు కృతజ్ఞతలు అని చెబుతూ.. ఒక్కటే వాక్యంలో రాజీనామా లేఖను ముగించారు. వాస్తవానికి, గతేడాది నుంచే తుమ్మల బీఆర్‌‌‌‌ఎస్‌‌కు రాజీనామా చేస్తారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ఇంటికి వెళ్లిన హరీశ్‌‌రావు, పువ్వాడ అజయ్‌‌ తదితరులు తుమ్మలను బుజ్జగించి పార్టీలోనే కొనసాగేలా చూశారు. ఈ క్రమంలో పాలేరు టికెట్‌‌ను తుమ్మల ఆశించినా, కేసీఆర్ ఆయనకు మొండిచేయి చూపించారు. దీంతో తుమ్మల కాంగ్రెస్‌‌లో చేరారు. 

కోమటిరెడ్డి సమక్షంలో పార్టీలోకి జిట్టా..

ఇటీవల బీజేపీ నుంచి సస్పెన్షన్‌‌కు గురైన జిట్టా బాలకృష్ణా రెడ్డి శనివారం కాంగ్రెస్‌‌లో చేరారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌‌ రెడ్డి జిట్టాకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. భువనగిరి అసెంబ్లీ టికెట్‌‌ను జిట్టా ఆశిస్తున్నారు. 2009, 2014 ఎన్నికల్లో భువనగిరి నుంచి ఇండిపెండెంట్‌‌గా పోటీ చేసిన బాలకృష్ణ.. రెండుసార్లు రెండో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత యువ తెలంగాణ పార్టీ పెట్టి, ఆ పార్టీ తరఫున 2018 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత బీజేపీలో పార్టీని విలీనం చేశారు. పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌‌ని తప్పించినప్పటి నుంచి జిట్టా అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకోవడం, పార్టీ ఆయన్ను సస్పెండ్ చేయడం జరిగిపోయాయి.