- ఆందోళనలో ఆయకట్టు రైతులు
అయిజ/శాంతినగర్, వెలుగు: గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఆర్డీఎస్ ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించేందుకు నిర్మించిన తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్ మరోసారి నిలిచిపోయింది. వారం రోజుల కింద ప్రారంభించిన లిఫ్ట్ మళ్లీ ఆదివారం నిలిచిపోవడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఈ సీజన్లో మూడోసారి లిఫ్ట్నిలిచిపోవడంతో ఆయకట్టు కింద సాగు చేసిన మిర్చి, మక్కలు, ఆముదం పంటలు ఎండే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. కనీసం డిస్ట్రిబ్యూటర్ 29 వరకు సాగుచేసిన పంటలకు ఒక్క తడి కూడా అందకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు.
పదే పదే లిఫ్ట్ నిలిచిపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ సెక్రెటరీ సంపత్ కుమార్ ఇరిగేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. నీళ్ల కోసం ఇండెంట్ ఎంత పెట్టారని, ప్రస్తుతం నదిలో నీటి నిల్వ ఎంత ఉందని ఏఈ విజయ్ కుమార్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఇండెంట్ నీళ్లు త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. లిఫ్ట్ ప్రారంభమైన వెంటనే అధికారులు డిస్ట్రిబ్యూటర్లను పర్యవేక్షించి, పద్ధతి ప్రకారం ఆయకట్టుకు సాగునీరు అందించాలన్నారు. ఈ నెల 9 లోగా ఆయకట్టుకు నీరు అందకపోతే కలెక్టరేట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.