30 పడకల ఆస్పత్రి ఏర్పాటుకు కృషి : మందుల సామెల్

మోత్కూరు, వెలుగు: మోత్కూరులో 30 పడకల ఆస్పత్రి, పోస్టుమార్టం సౌకర్యం కోసం కృషి చేస్తున్నానని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ చెప్పారు. శనివారం  మోత్కూరు మున్సిపల్ కేంద్రం, ముషిపట్లలో రూ.40 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం  మోత్కూరులో ఎన్ఆర్ఐ పోచం నారాయణ ఏర్పాటు చేసిన నియో స్పోర్ట్స్ క్లబ్, ఉమ్మడి జిల్లాస్థాయి క్రీడాపోటీలను ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి రూ.10 కోట్లు మంజూరు చేశారని, అందులో నుంచి తాగునీటి అవసరాల కోసం రూ.1.70 కోట్లు కేటాయించానన్నారు.  ఈజీఎస్ కింద రూ.13 కోట్లు రాగా.. మోత్కూరు, అడ్డగూడూరు మండలాలకు రూ.2 కోట్లు, శాలిగౌరారంకు రూ.1.20 కోట్లు, తుంగతుర్తి, నూతనకల్, మద్దిరాల, అర్వపల్లి, నాగారం, తిరుమలగిరి మండలాలకు రూ.10.40 కోట్లు కేటాయించానని చెప్పారు. 

మున్సిపల్ అభివృద్ధికి మంత్రి వెంకట రెడ్డిని రూ.12 కోట్లు మంజూరు చేయాలని కోరగా సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు.  మెయిన్ రోడ్డు విస్తరణ పనులను కూడా ఒకట్రెండు రోజుల్లో ప్రారంభిస్తామన్నారు.  మోత్కూరులో 50 ఏళ్లుగా ప్రతి ఆదివారం నడిచే సంత గత మున్సిపల్ చైర్మన్ నిర్ణయంతో మూతపడిందని, తిరిగి ఆ సంతను ఆదివారం నుంచి  ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. కాశవాడ కాలనీ మీదుగా వెళ్లిన హైటెన్షన్ విద్యుత్ లైన్ ను   తొలగిస్తామని,  గతంలో ఇచ్చిన హామీ మేరకు ఉన్నత పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తానన్నారు.  

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గుర్రం కవితలక్ష్మీ నర్సింహారెడ్డి, వైస్ చైర్మన్  వెంకటయ్య, జడ్పీటీసీ గోరుపల్లి శారదనంతోష్ రెడ్డి, వైస్ ఎంపీపీ బుశిపాక లక్ష్మీ మారయ్య, మాజీ సర్పంచ్ పైళ్ల విజయనర్సిరెడ్డి, నాయకులు పైళ్ల సోమిరెడ్డి, డాక్టర్ జి.లక్ష్మీ నర్సింహారెడ్డి,  అవిలిమల్లు,  రామచంద్రు, పన్నాల శ్రీనివాస్ రెడ్డి, బద్దం నాగార్జునరెడ్డి,  పి.స్వామిరాయుడు, కౌన్సిలర్లు  వెంకన్న,  శిరీష,  సుజాత, మలిపెద్ది రజిత, వనం స్వామి పాల్గొన్నారు