సింగిల్ విండో అవకతవకలపై ఎంక్వైరీ కమిటీ : మందుల సామేల్

మోత్కూరు, వెలుగు : మోత్కూరు సింగిల్ విండో అవకతవకలపై ఎంక్వైరీ కమిటీ వేయనున్నట్టు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తెలిపారు. గత 25 ఏండ్లుగా సంఘంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతోపాటు డైరెక్టర్లకు తెలియకుండా ఎన్నో అక్రమాలు జరిగాయని, వాటన్నింటినీ వెలికితీసేందుకు ఎంక్వైరీ కమిటీ వేయాలని జిల్లా ఆఫీసర్లను ఆదేశించినట్టు చెప్పారు. చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు అధ్యక్షతన గురువారం జరిగిన సంఘం 23వ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. 

ఆగస్టు 15 లోపు ప్రభుత్వం రైతులకు రూ.2 లక్షల పంట రుణమాఫీ ఒకేసారి చేస్తుందన్నారు. మోత్కూరు బిక్కేరువాగుపై, అమ్మనబోలు మూసీపై హై లెవెల్ బ్రిడ్జిల నిర్మాణం కోసం మంత్రి వెంకట్ రెడ్డిని కోరగా, ప్రతిపాదనలు పంపేందుకు సర్వే చేస్తున్నట్లు చెప్పారు. మోత్కూర్ లో కాలేజీ విద్యార్థుల హాస్టల్ కోసం త్వరలోనే ఖాళీగా ఉన్న బీసీ హాస్టల్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. 

మోత్కూరు రెవెన్యూ డివిజన్, 30 పడకల ఆస్పత్రి, పీఆర్ రోడ్ల కోసం ఆయాశాఖల మంత్రులను కలిశానన్నారు. ఫైర్ స్టేషన్ కు సొంత భవనం కోసం స్థలం కేటాయిస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు సోమిరెడ్డి, డాక్టర్ల లక్ష్మీనర్సింహారెడ్డి, అవిలిమల్లు, కంచర్ల యాదగిరి రెడ్డి, సింగిల్​విండో చైర్మన్ పి.వెంకటేశ్వర్లు, పన్నాల శ్రీనివాస్ రెడ్డి, రాచకొండ బాలరాజు పాల్గొన్నారు.