మునుగోడు ఉప ఎన్నిక  కృత్రిమ ఎన్నిక : ఎమ్మెల్యే గాదరి కిషోర్ 

మునుగోడు ఉప ఎన్నిక.. కృత్రిమ ఎన్నిక అని తుంగతుర్తి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ వ్యాఖ్యానించారు. ఉప ఎన్నిక ప్రచారానికి వస్తున్న ప్రతిపక్ష నాయకులు మునుగోడు నియోజకవర్గానికి ఏం చేశారో, భవిష్యత్తులో ఏం చేస్తారో మాత్రం చెప్పడం లేదని మండిపడ్డారు. బీజేపీ నాయకులను మునుగోడు ప్రజలు తరిమి కొడుతారని పేర్కొన్నారు. ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చీకటి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని ఆరోపించారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు చర్యలు తీసుకోదో చెప్పాలని డిమాండ్ చేశారు.

మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఈసారి ఓటు వేయాలంటూ ఓ కాంగ్రెస్ నేతకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ చేసి అడిగిన విషయం తెలిసిందే. వెంకట్ రెడ్డి ఫోన్ కాల్ ఆడియో వైరల్ కావడంతో రాజకీయ వర్గాల్లో దానిపై వాడివేడి చర్చ జరిగింది. మరోవైపు మునుగోడులో తాను ప్రచారం చేసినా, చేయకపోయినా కాంగ్రెస్ గెలవదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్ చేశారు. తాను ప్రచారానికి వెళ్తే మహా అయితే మరికొన్ని ఓట్లు పడతాయే తప్ప.. పార్టీ గెలిచే పరిస్థితి లేదన్నారు.

హోరాహోరీగా ప్రచారం

మునుగోడు ఉప ఎన్నిక బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులు ఉన్నారు. నవంబర్ 3వ తేదీన ఉప ఎన్నిక జరగనుండగా, 6వ తేదీన ఫలితాన్ని వెల్లడిస్తారు. మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు కీలకంగా మారింది. మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధిస్తే, రాబోయే ఎన్నికలపైనా ఆ ప్రభావం తప్పనిసరిగా ఉంటుందని అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి, బీఎస్పీ నుంచి అందోజు శంకరాచారి, టీ‌జే‌ఎస్ నుంచి పల్లె వినయ్ కుమార్ బరిలో ఉన్నారు. మునుగోడును సీటును గెలుచుకునేందుకు అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే ప్రచారంలో మరింత స్పీడు పెంచాయి.