బోనస్​ బోగస్.. ఖాతాల్లో జమకాని డబ్బులు

భద్రాచలం, వెలుగు: తునికాకు కార్మికులకు నేటికీ బోనస్​ డబ్బులు జమకావడం లేదు. జిల్లాలోని భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు, కొత్తగూడెం, పాల్వంచ, కిన్నెరసాని వైల్డ్ లైఫ్​ డివిజన్లలో 2లక్షల 4వేల 495 స్టాండర్డ్ బ్యాగుల తునికాకు సేకరించారు. వీటిని విక్రయించడం వల్ల రూ.75 కోట్ల 77లక్షల 69వేల 374లు వచ్చాయి. 

ఇందులో రూ.1,10,670 లు కార్మికుల ఖాతాల్లో జమ చేసినట్లుగా ప్రభుత్వం చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో తమకు ఇంకా బోనస్​ డబ్బులు రాలేదంటూ కార్మికులు ఆయా మండలాల్లో ఆందోళనలు చేస్తున్నారు. గతంలో టేకులపల్లి, తాజాగా దుమ్ముగూడెం మండలం బట్టిగూడెం గ్రామానికి చెందిన 60మందికి ఇంకా బోనస్​ రాలేదని ఆరోపిస్తూ ఫారెస్ట్ రేంజ్​ ఆఫీసులను ముట్టడించారు. 

తలనొప్పిగా మారిన బోనస్​ డబ్బుల వ్యవహారం

ఫారెస్ట్ ఆఫీసర్లకు బోనస్​ డబ్బుల వ్యవహారం తలనొప్పిగా మారింది. తునికాకు కల్లాల్లో పనిచేసే కల్లేదారుల నుంచి కార్మికుల పర్సనల్ బ్యాంకు అకౌంట్​ నెంబర్లను తీసుకుని టీఎస్​ఎఫ్డీసీకి పంపించారు. అయితే కార్మికుల్లో కొందరికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. ఎన్​పీసీఐ( నేషనల్​ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) ప్రకారం మ్యాపింగ్​ ఉన్న ఖాతాల్లో మాత్రమే ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు జమ చేయాలని ఆర్బీఐ నిబంధనలు విధించింది. 

దీంతో చాలామంది కార్మికులకు బోనస్​ డబ్బులు జమ కావడం లేదు. ఇక పలు యూనిట్లలో బోనస్​ పంపిణీలో అవకతకవలు జరిగాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కల్లేదారులు కొందరు వేజ్​ రిజిస్టర్లు మాయం చేయడం, కార్మికుల వద్ద వేజ్​ కార్డులు లేకపోవడం వంటి కారణాలతో అర్హులైన వారికి బోనస్​డబ్బులు రావట్లేదు. బ్యాంకు ఖాతాల నెంబర్లు కూడా తప్పుల తడకగా ఉన్నాయని మరికొందరు 
ఆరోపిస్తున్నారు. 

అందరికీ అకౌంట్లలో పడుతున్నాయి:

తునికాకు కార్మికులందరికీ వారి బ్యాంకు అకౌంట్లలో బోనస్​ డబ్బులు పడుతున్నాయి. ఒకే అకౌంట్లో రైతుబంధు, ఉపాధి హామీ పథకం, ధాన్యం అమ్మిన డబ్బులు వేస్తున్నారు. బోనస్​ డబ్బులు తక్కువగా ఉండటంతో చాలామంది వీటిని గుర్తించడం లేదు. ఒకవేళ ఆర్బీఐ నుంచి లిస్టు వస్తే పరిశీలించి డబ్బులు పడనివారి వివరాలు చూసి సమస్యను పరిష్కరిస్తాం.
 

కనకమ్మ, రేంజర్​, దుమ్ముగూడెం

మాయ చేశారు


బోనస్​ పంపిణీలో ఆఫీసర్లు మాయ చేశారు. కావాలనే బ్యాంకు నెంబర్లు తప్పుగా పంపారు. మా కష్టానికి ప్రతిఫలం ఇంకెప్పుడు దక్కుతుంది. అడవుల్లో జంతువులను, పాములను తప్పించుకుని తునికాకు సేకరిస్తే తీరా డబ్బులు వచ్చేసరికి అన్యాయం జరిగింది.  తక్షణమే మా బోనస్​ మాకిప్పించాలి. 
 

ముర్రం ధర్మయ్య, బట్టిగూడెం