
- గంటకు 2.4 మీటర్ల మేర తవ్వకాలు
- అమెరికా నుంచి తెప్పించిన ప్రభుత్వం
- టీబీఎం మొత్తం పొడవు 132.4 మీటర్లు.. బరువు1,500 టన్నులు
- పని పూర్తయ్యాక ఎక్కడికక్కడ పార్ట్‌లుగా విడదీసే ప్రక్రియ
హైదరాబాద్, వెలుగు: ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వకంలో కాంపొనెంట్ టన్నెల్ బోరింగ్ మెషిన్ (టీబీఎం) ఎంతో కీలకం. కొండలు, గుట్టలు తొలిచేందుకు మామూలుగా అయితే.. కంట్రోల్డ్ బ్లాస్టింగ్ మెథడ్ వాడుతుంటారు. అయితే, దాంతో పర్యావరణానికి నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానికి ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిన పద్ధతే టీబీఎం. ఎస్ఎల్బీసీ విషయంలో భారీ కొండ కావడం, అడవులు ఉండటం, టైగర్ రిజర్వ్ జోన్ కావడంతో హార్డ్ రాక్ టీబీఎంలవైపే అప్పటి ప్రభుత్వం మొగ్గు చూపింది.
అమెరికాకు చెందిన రాబిన్స్ అనే సంస్థ నుంచి టీబీఎంలను తెప్పించింది. గంటకు 2.4 మీటర్ల మేర సొరంగాన్ని తవ్వుతాయి. ఈ టీబీఎం మొత్తం పొడవు 132.4 మీటర్లు. టీబీఎంలను ఒకసారి వినియోగిస్తే.. మళ్లీ దాన్ని యూజ్ చేయలేం. టన్నెల్ తవ్వేటప్పుడు లోపలికి పంపే ఆ మెషిన్‌ను.. పని పూర్తయ్యాక ఎక్కడికక్కడ పార్ట్‌లుగా విడదీసి అందులోనే వదిలేసేలా ఏర్పాట్లు చేస్తుంటారు.
టీబీఎంలో బ్యాకప్ సిస్టమ్స్
టీబీఎం మెషిన్లలో సొరంగాన్ని తవ్వడమే కాకుండా.. దాని నుంచి వచ్చే శిథిలాలను బయటకు తీసుకొచ్చే కన్వేయర్ సిస్టమ్‌లు, సొరంగాన్ని స్మూత్‌గా చేసేందుకు గ్రౌట్ ప్రోబ్, అగ్నిప్రమాదాలను ఆర్పేందుకు, ఒకవేళ నీళ్లొస్తే వాటిని తోడేసేందుకు, సొరంగానికి లైనింగ్ వేసేందుకు ప్రత్యేకంగా బ్యాకప్ వ్యవస్థలూ ఉంటాయి.
ప్రోబ్/గ్రౌట్ డ్రిల్ ఫిక్సర్, ప్రోబ్/గ్రౌట్ డ్రిల్ కాప్కో, డ్రై గ్రౌట్ సిస్టమ్, ఇన్వర్ట్ గ్రౌట్ పంప్, సెకండరీ గ్రౌట్ పంప్, లేజర్ గైడెన్స్ సిస్టమ్, ఫైర్ సస్పెన్షన్ సిస్టమ్, డేటా ఆక్విజిషన్ సిస్టమ్, సేఫ్టీ కంటెయినర్లను మెయిన్ మెషిన్‌కు అటాచ్ చేసి లోపలికి పంపిస్తారు.
తవ్వకాలకు భారీగా మౌలికవసతులు
టీబీఎంల తరలింపు, సొరంగం తవ్వకాల పనుల కోసం భారీగానే మౌలిక వసతులు కల్పించారు. 20 కిలో మీటర్ల మేర రోడ్లు వేశారు. టీబీఎంలు, అధికారులు, కార్మికులు పనికోసం లోపలికి వెళ్లేందుకు 50 కిలో మీటర్ల మేర రైల్వే ట్రాక్ ఏర్పాటు చేశారు. టీబీఎం నడిచేందుకు, టన్నెల్ లోపల లైటింగ్ ఇతర అవసరాల కోసం విద్యుత్‌ను సరఫరా చేసేలా 56 కిలో మీటర్ల మేర 33 కిలో వోల్టుల హైటెన్షన్ లైన్ లాగారు. గంటకు 720 టన్నుల సామర్థ్యం ఉన్న 2 చిల్లింగ్ ప్లాంట్లు, 89 కిలో మీటర్ల పొడవు ఉన్న ఐస్ వాటర్ పైప్‌లైన్ సర్క్యూట్లను నిర్మించారు.
375 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న 8 వెంటిలేషన్ ఫ్యాన్లు పెట్టారు. 13 ఎంవీఏ సామర్థ్యమున్న 3 ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లు, 12 ఎంవీఏ సామర్థ్యమున్న రెండు డీజీ స్టేషన్లు, అధికారులు, కార్మికులు టన్నెల్ లోపలికి వెళ్లేలా 14 డీజిల్ లోకోమోటివ్స్, గంటకు 300 టన్నుల వ్యర్థాలను క్రష్ చేసే 2 ప్లాంట్లు, గంటకు 120 క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీట్ తయారు చేసే 4 బ్యాచింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు.
1,800లో తొలిసారిగా..
టీబీఎంలు తొలిసారిగా 1845లో వ్యాప్తిలోకి రాగా.. అంతకన్నా ముందు 1800వ సంవత్సరంలో టీబీఎం షీల్డ్ (తవ్వేది)ను అభివృద్ధి చేశారు. మార్క్ ఇసాంబార్డ్ బ్రూనెల్ అనే ఫ్రెంచ్–బ్రిటిష్ ఇంజినీర్ ఈ షీల్డ్‌ను డెవలప్ చేయగా.. 1825లో లండన్‌లోని థేమ్స్ నది కింద 400 మీటర్ల పొడవైన సొరంగాన్ని తవ్వేందుకు ఆ షీల్డ్ వినియోగించారు.
ఆ తర్వాత హెన్రి మౌస్ అనే ఇంజినీర్.. మౌంటెయిన్ స్లైసర్ పేరిట తొలి టీబీఎంకు రూపకల్పన చేశారు. ఇప్పటిదాకా ప్రపంచంలోనే భారీ బోరింగ్ మెషిన్‌ను తయారు చేసిన రికార్డు రాబిన్స్ కంపెనీ పేరిటే ఉంది. 2013లో కెనడాలోని నయాగారా టన్నెల్ ప్రాజెక్టు కోసం 14.4 మీటర్ల వ్యాసంతో ఆ టీబీఎంను రాబిన్స్ సంస్థ తయారు చేసింది. దానికి ‘బిగ్ బెక్కీ’ అనే నిక్నేమ్నూ పెట్టారు.
ఎస్ఎల్బీసీ టీబీఎం స్పెషాలిటీస్
టీబీఎం వ్యాసం 10 మీటర్ల డబుల్ షీల్డ్
డబుల్ షీల్డ్‌తో కలిపి టీబీఎం ప్రధాన కాంపొనెంట్ పొడవు 12.40 మీటర్లు
టీబీఎం బ్యాకప్ సిస్టమ్ పొడవు 120 మీటర్లు
మొత్తం బరువు 1,500 టన్నులు
టీబీఎంకు అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ల మొత్తం కెపాసిటీ 5,100 హార్స్పవర్
కన్వేయర్ సిస్టమ్ కెపాసిటీ గంటకు 800 మెట్రిక్ టన్నులు
కన్వేయర్ సిస్టమ్ పొడవు 22.5 కిలో మీటర్లు
స్టాకర్ కన్వేయర్ కెపాసిటీగంటకు 800 మెట్రిక్ టన్నులు