- తాడ్‌బండ్ నుంచి ఎయిర్‌పోర్టు కిందిగా బాలంరాయి వరకు..
- 28.40 మీటర్ల వెడల్పుతో 600 మీటర్ల నిర్మాణానికి ప్లాన్
- ఎయిర్ పోర్టు అథారిటీ, కంటోన్మెంట్ అధికారులకు హెచ్ఎండీఏ ప్రతిపాదనలు
హైదరాబాద్ సిటీ, వెలుగు : సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్పల్లి, తాడ్ బండ్, బాలంరాయి ప్రాంతాల మధ్య ట్రాఫిక్ సమస్యకు చెక్‌పెట్టేందుకు హెచ్ఎండీఏ అధికారులు కొత్త నిర్ణయం తీసుకున్నారు. తాడ్‌బండ్ చౌరస్తాకు కొద్ది దూరం నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టు మీదుగా బాలంరాయి వరకు టన్నెల్ రోడ్ నిర్మించాలని భావిస్తున్నారు. ఈ టన్నెల్ రూట్ బేగంపేట ఎయిర్ పోర్టు రన్‌వేను ఆనుకుని వెళ్లనుంది. టన్నెల్ 600 మీటర్ల పొడవు, వెడల్పు 28.40 మీటర్లు ఉండనుంది.
టన్నెల్ రోడ్‌కు సంబంధించి హెచ్ఎండీఏ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసి ఎయిర్‌పోర్టు అథారిటీతోపాటు కంటోన్మెంట్అధికారులకు పంపించింది. ఈ మార్గం నుంచి వచ్చేవారు త్వరలో నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ పైకి ఎక్కి వెళ్లేందుకు కనెక్టివిటీ ఉంటుందని తెలుస్తోంది.
టన్నెల్ మార్గం అందుబాటులోకి వస్తే బోయిన్ పల్లి, సిక్ విలేజ్, తాడ్ బండ్ చౌరస్తా, బాలంరాయి ప్రాంతాల ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని హెచ్ఎండీఏ అధికారులు అంచనా వేస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు ప్రయాణ దూరం తగ్గుతుందంటున్నారు.