స్మోకింగ్ ఆరోగ్యానికి హానికరమని తెలిసినా.. చాలామంది మానలేకపోతుంటారు. ఏళ్ల తరబడి ఉన్న అలవాటుని మార్చుకోవడం అంత ఈజీ కాదు. అందుకే స్మోకింగ్ ఆపేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ చాలామంది ఫెయిల్ అవుతుంటారు. అందుకు అపారమైన సంకల్ప బలం, అంకితభావం ఉండాలి. అయితే.. పదకొండేళ్ల క్రితం టర్కీకి చెందిన ఇబ్రహీం యాసెస్ సిగరెట్ మానేయడానికి తలకు పంజరం ఆకారంలో ఉన్న మెటల్ హెల్మెట్ కేజ్ పెట్టుకుని మరీ ప్రయత్నించాడు. అతను అప్పటికే దాదాపు 26 ఏళ్లపాటు స్మోకింగ్ చేశాడు.
2013 వరకు యుసెల్ రోజుకు రెండు ప్యాకెట్ల సిగరెట్లు తాగేవాడు. అతని ఆరోగ్యం పట్ల కుటుంబీకులు ఆందోళన చెందడంతో యూసెల్ ఆ అలవాటు మానేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ప్రతి సంవత్సరం అతని మ్యారేజ్ యానివర్సరీ, ముగ్గురు పిల్లల పుట్టినరోజులప్పుడు సిగరెట్ తాగడం మానేస్తానని ప్రతిజ్ఞ చేసేవాడు. కానీ.. కొన్ని రోజులకు కథ మళ్లీ మొదటికి వచ్చేది.
ఇప్పటికీ అతను సిగరెట్ మానేశాడా? లేదా? అనేది తెలియదు. కానీ.. పదకొండేళ్ల క్రితం తీసిన అతను కేజ్ పెట్టుకున్న ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే.. కొన్నాళ్ల క్రితం ‘నాన్ ఈస్తటిక్ థింగ్స్’ అనే ట్విట్టర్ పేజీలో ఆ ఫొటోలు షేర్ చేయడంతో నెటిజన్స్ అతని గురించి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ప్రతి సంవత్సరం 8 మిలియన్ల కంటే ఎక్కువ మంది స్మోకింగ్ వల్ల చనిపోతున్నారు. సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ వల్ల ఎంతోమంది అనారోగ్యం పాలవుతున్నారు. దీనివల్ల ఏటా 1.2 మిలియన్ల మంది చనిపోతున్నారు. అందులో 65వేల మంది పిల్లలే.