పసుపు రేట్‌‌ ఢమాల్‌‌..ఆందోళనలో రైతులు

పసుపు రేట్‌‌ ఢమాల్‌‌..ఆందోళనలో రైతులు
  • క్వింటాల్‌‌కు రూ. 9,500 మాత్రమే చెల్లిస్తున్న వ్యాపారులు
  • నిరుడు రూ. 18 వేలకుపైనే పలికిన రేటు
  • క్వాలిటీ లేదని, పచ్చి పసుపు తెచ్చారంటూ ధర తగ్గిస్తున్న ట్రేడర్లు
  • నాఫెడ్‌‌ ద్వారా కొనుగోళ్లు చేయాలని కేంద్ర మంత్రికి లెటర్‌‌ రాసిన మంత్రి తుమ్మల

నిజామాబాద్, వెలుగు : పసుపు రేట్‌‌ భారీ స్థాయిలో పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గతేడాది మార్చిలో రూ.18,200 పలికిన క్వింటాల్‌‌ పసుపు ఈసారి రూ.9,500కు పడిపోయింది. నాలుగు రోజుల కింద రైతులు ఆందోళన చేయడంతో ట్రేడర్లు ఈ రేట్​ఫిక్స్​ చేశారు. అంతకుముందు వరకు రూ.8,500 ధర మాత్రమే చెల్లించారు. ట్రేడర్లు, ఏజెంట్లు కుమ్మక్కై తమను దోచుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. మహారాష్ట్ర సాంగ్లీ మార్కెట్‌‌లో రూ.14,341 ధర ఉండగా నిజామాబాద్‌‌లో మాత్రం తక్కువ ధర చెల్లిస్తున్నారని వాపోతున్నారు. ఇదిలా ఉండగా రైతులు నష్టపోకుండా ఉండాలంటే నాఫెడ్‌‌ ద్వారా పసుపు కొనుగోళ్లు చేయాలని కేంద్ర మంత్రికి రాష్ట్ర మంత్రి తుమ్మల లెటర్‌‌ రాశారు.

ఈ ఏడాది పెరిగిన పసుపు సాగు

గతేడాది పసుపు ధర భారీగా ఉండడంతో ఈ సారి కూడా చాలా మంది రైతులు పసుపు సాగుకు ఆసక్తి చూపారు. నిజామాబాద్‌‌ జిల్లాలో గతేడాది 24 వేల ఎకరాల్లో పసులు సాగు కాగా ఈ ఏడాది మరో నాలుగు వేల ఎకరాలు పెరిగి 28 వేల ఎకరాల్లో సాగైంది. గతేడాది 7.23 లక్షల క్వింటాళ్ల పసుపు కొనుగోళ్లు జరుగగా, ఈ సారి 11 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో ఇప్పటివరకు 5.64 లక్షల క్వింటాళ్ల సరుకు కొనుగోలు చేశారు.

 ఏజెంట్లు, ట్రేడర్ల నిర్ణయమే ఫైనల్

నిజామాబాద్, జగిత్యాల, మెట్‌‌పల్లిలో పసుపు మార్కెట్‌‌ ఉన్నప్పటికీ రైతులు ఎక్కువగా ఇందూర్‌‌ మార్కెట్‌‌కే వస్తారు. ఇక్కడ 124 మంది ట్రేడర్లు ఉండగా, వారిలో 20 మంది ఇంటర్నేషనల్​మార్కెటింగ్​చేస్తారు. కొనుగోళ్ల ప్రక్రియ అంతా 82 మంది ఏజెంట్ల కనుసన్నల్లో నడుస్తోంది. వారు ఫైనల్​ చేసిందే రేట్ అన్నట్లుగా పరిస్థితి మారింది. పసుపు అమ్మకం విలువలో 2 శాతం కమీషన్​ తీసుకునే ఏజెంట్లు లేకుండా ట్రేడర్లు అడుగు కూడా ముందుకు వేయడం లేదు. ధర పెంచకుండా తమకు నష్టం చేస్తున్నారని పేర్కొంటూ ఈ వారంలో రెండు సార్లు రైతులు ఆందోళనకు దిగారు. 

డీపీసీ ఏర్పాటు చేసినా..

రైతుల పరిస్థితి గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం ఏజెంట్ల ప్రమేయం లేకుండా కొనుగోళ్లు జరిగేలా పది రోజుల  కింద డైరెక్ట్‌‌ పర్చేజ్‌‌ సెంటర్‌‌ను (డీపీసీ) ఏర్పాటు చేసింది. డీపీసీ సెంటర్‌‌ ద్వారా సరుకు కొనడానికి ట్రేడర్లు ముందుకు రాలేదు. దీంతో తిరిగి ఏజెంట్లే హవా కొనసాగిస్తున్నారు. 

కర్కుమిన్​(పసుపు క్వాలిటీ) శాతం తక్కువ ఉందని, పచ్చి పసుపు తెచ్చారని, రకరకాల కారణాలతో తక్కువ రేట్‌‌కు సరుకు అమ్ముకునేలా చేస్తున్నారు. కొమ్ము పసుపునకు మాత్రమే రూ.9,500 రేట్​ఇస్తూ, మండ, చూరకు రూ.వెయ్యి తగ్గిస్తున్నారు. తమకు గిట్టుబాటు కావడం లేదని రైతులు వాపోతున్నా పట్టించుకునేవారు లేరు. డీపీసీతో ఎలాంటి లాభం లేకపోవడంతో రైతులు ఎంఎస్‌‌పీ అందించేందుకు నాఫెడ్‌‌ ద్వారా పసులు కొనాలని రైతులు కోరుతున్నారు.

మార్కెట్‌‌ ఇంటర్వెన్షన్‌‌ స్కీమ్‌‌ కింద పసులు సేకరించాలి

కేంద్రమంత్రి చౌహన్‌‌కు మంత్రి తుమ్మల లెటర్​

హైదరాబాద్​: రాష్ట్రంలో పసుపు ధరలపై దృష్టి సారించి రైతులను ఆదుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు కేంద్రమంత్రి శివరాజ్‌‌ సింగ్‌‌ చౌహాన్‌‌కు లెటర్‌‌ రాశారు. నాఫెడ్‌‌ ద్వారా మార్కెట్‌‌ ఇంటర్వెన్షన్‌‌ స్కీం కింద పసుపు కొనుగోలు చేయాలని లేఖలో కోరారు. 

రాష్ట్రంలో 42,093 ఎకరాల్లో పసుపు సాగు కాగా, 1.25 లక్షల టన్నుల దిగుబడి వచ్చిందన్నారు. ప్రస్తుతం పసుపు క్వింటాల్‌‌కు రూ.17 వేల నుంచి రూ.11 వేల మధ్య ఉందని, ఈ ధర మరింత తగ్గే సూచనలు ఉన్నాయన్నారు. గత రెండేండ్లలో పసుపు ధర 17 నుంచి 27 శాతం వరకు తగ్గాయన్నారు. 

రైతులను ఆదుకునేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. స్వామినాథన్‌‌ కమిటీ సిఫార్సు మేరకు ఇంటర్వెన్షన్‌‌ స్కీమ్‌‌ కింద పసుపు కొనాలని మంత్రి లేఖలో పేర్కొన్నారు. మార్చిలో ఎక్కువ మొత్తంలో పసుపు పంట మార్కెట్‌‌కు వచ్చే అవకాశం ఉన్నందున రైతులు నష్టపోకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.