పసుపు బోర్డుతో  రైతులకు, భావితరాలకు మేలు..ఇక డ్రైపోర్టు తీసుకురావాలనేదే నా లక్ష్యం: ఎంపీ ధర్మపురి అరవింద్

పసుపు బోర్డుతో  రైతులకు, భావితరాలకు మేలు..ఇక డ్రైపోర్టు తీసుకురావాలనేదే నా లక్ష్యం: ఎంపీ ధర్మపురి అరవింద్

న్యూ ఢిల్లీ, వెలుగు : పసుపు బోర్డుతో నిజామాబాద్ ప్రజల దశాబ్దాల కల నెరవేరిందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. రాజకీయాల కోసం పసుపు బోర్డు తేలేదని తెలిపారు. రైతులకు, భావితరాలకు మేలు చేసేందుకే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని స్పష్టం చేశారు. గురువారం "వీ6 వెలుగు" తో ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రత్యేకంగా మాట్లాడారు. పసుపు బోర్డు విషయంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఎప్పటికి రుణపడి ఉంటానని వెల్లడించారు. మద్దతు ధర విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.

బోర్డు రాకతో పసుపు రైతులకు ఎంతగానో లాభం జరగబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నాణ్యత నుంచి మొదలు పెట్టుకుంటే పరిశోధనలు, ఎగుమతులు లాంటివి పెరుగుతాయని తెలిపారు. ఇందూరుకు డ్రైపోర్ట్ తీసుకురావాలనేది తన భవిష్యత్ లక్ష్యమని చెప్పారు. నిజామాబాద్ కు కేంద్రం నుంచి రావాల్సిన సహాయం అందుతుందని, బీజేపీని గెలిపించినందుకు అభివృద్ధిని చేసి చూపిస్తున్నామని వివరించారు. నిజామాబాద్ ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చినందుకు తనకు సంతోషంగా ఉందని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అహర్నిషలు శ్రమించామని అరవింద్ పేర్కొన్నారు.